భారత్ చైనా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఏకంగా 40 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన దాడిలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. అయితే ఇరు దేశాల మధ్య చర్చల తర్వాత ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. కానీ ఇంకా సరిహద్దులో పరిస్థితి తీవ్రంగానే కనిపిస్తోంది. గాల్వాన్ ఘటనతో లద్దాఖ్‌లో పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.

 

 

అయితే అసలు చైనా ఇండియాపై దాడికి ఈ గాల్వాన్ ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకుంది. ఇక్కడే ఎందుకు దాడి చేసింది. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి.. ఓసారి తెలుసుకుందాం. ఈ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖపై ఇండియా- చైనా మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయి. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరానికి పశ్చిమాన వాస్తవాధీన రేఖ ఉందని చైనా అంటోంది. కాదు.. తూర్పున ఉందని భారత్ అంటోంది.

 

 

ఈ ప్రాంతంలోనే చైనా అతిక్రమణలకు పాల్పడుతోంది. గాల్వాన్‌ నది టిబెట్‌ నుంచి వస్తూ షివోక్‌ నదిలో కలుస్తుంది. షివోక్‌ వాస్తవాధీనరేఖ నుంచి 8 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్‌ను కలిపే కీలక రోడ్డు ఉంది. చైనా ఇందులోకి వస్తే మనకు రోడ్డు ఉండదు. అందుకే ఈ ప్రధాన రహదారిని కాపాడుకోవడానికి గాల్వాన్‌ లోయ ఇండియాకు చాలా ముఖ్యం.

 

 

ఎలాగైనా ఈ రోడ్డులోకి వచ్చి భారత్ కు రోడ్డు లేకుండా చేయాలని చైనా భావిస్తున్నట్టు మన ఆర్మీ అనుమానిస్తోంది. అందుకే అక్కడ చైనాకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని ఇండియా భావిస్తోంది. ఇదే ఇరు దేశాలకూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోంది. గతంలోనూ ఇలాంటి గొడవలు చైనాతో మనకు వచ్చాయి. డోక్లామ్‌, చుమార్‌లలోనూ ఉభయ సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అయినా ప్రాణనష్టం జరిగేంత హింస జరగలేదు. కానీ గాల్వాన్ వద్ద మాత్రం ఇరు దేశాలు ప్రాణాలు కోల్పోయాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: