భారత్- చైనా సరిహద్దుల్లో మళ్లీ వేడి రాజుకుంది. 40 ఏళ్లలో ఎన్నడూ లేనిది తాజాగా రెండు వైపుల నుంచి ప్రాణనష్టం జరిగేంతగా ఘర్షణ జరిగింది. రెండు దేశాల సైనికులు తీవ్రంగా కొట్టుకున్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. దాదాపు నెలన్నరగా ఈ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం ఉన్నా.. అది భారీ ప్రాణ నష్టం దిశగా సాగడం విషాదం.

 

 

అయితే ఈ ఘర్షణలో భారత్‌ వైపు 20 మంది సైనికులు వీరమరణం పొందారు. చైనా సైతం 43 మందిని కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై రెండు దేశాలు తమకు అనుకూలమైన వాదనలే వినిపిస్తున్నాయి. చైనాదే తప్పని ఇండియా అంటుంటే.. ఇండియానే కవ్వించిందని చైనా అంటోంది. అయితే.. మరి ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియా ఏమంటుందో ఓసారి చూద్దాం..

 

 

అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య ఘర్షణ కావడంతో ఇంటర్నేషనల్ మీడియా ఈ అంశంపై దృష్టిసారించింది. అయితే.. చాలా పత్రికలు చైనాకే గడ్డి పెట్టాయి. ఇటీవల చైనా యుద్ధ వాహనాలు, ఆయుధ సామగ్రి, ట్రక్కులు, సైనికులను సరిహద్దు వెంట మోహరించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతల్లో చైనా నిప్పు రాజేసినట్లైందని కామెంట్ చేసింది. పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 

 

వాషింగ్టన్‌ పోస్ట్‌ మాత్రం ఎటువైపూ మొగ్గకుండా జస్ట్ వార్తను రిపోర్ట్ చేసింది. ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాల్లో గస్తీ కాస్తూ ఒకరి భూభాగంలోకి ఒకరు దూసుకెళ్లారని బీబీసీ తెలిపింది. నాలుగు దశాబ్దాల్లో ఒక్క తూటా పేలలేదని.. తాజా ఉద్రిక్తతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని కామెంట్ చేసింది. పొరుగు దేశాల భూభాగాల ఆక్రమణకు యత్నిస్తున్న చైనా విస్తరణ కాంక్ష మంచిది కాదని ది గార్డియన్ పత్రిక పరోక్షంగా చైనా కు గడ్డి పెట్టింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: