టీడీపీ భవిష్యత్తు నాయకుడు ఎవరు..? ఇదేం పిచ్చి ప్రశ్న, అధినేత చంద్రబాబు తర్వాత ఆయన సుపుత్రుడు లోకేషే కదా పార్టీని నడిపించాల్సింది అంటారా. సరే మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే, ఎందుకంటే మనవన్నీ వారసత్వ పార్టీలు కదా.. కాబట్టి చంద్రబాబు తర్వాత లోకేష్, లోకేష్ తర్వాత దేవాన్ష్ రావాల్సిందే.. వచ్చి తీరుతారు కూడా. మరి టీడీపీని నడిపించగలే శక్తి నారా లోకేష్ కి ఉందా..? అని అడిగితే.. ప్రతిపక్షాల మాట పక్కనబెట్టండి, సొంత పార్టీ నేతలు కూడా లేదనే సమాధానం చెప్తున్నారు. కాకపోతే ఈ ముక్క చంద్రబాబుతో నేరుగా చెప్పలేకపోతున్నారు. అయినప్పటికీ కొడుకు తెలివి చూసి ఇపాటికే చంద్రబాబు ఎప్పుడో అర్ధంచేసుకొని ఉంటారు. కానీ, తప్పదు కదా ఎలాగైనా లోకేష్ ను పార్టీ భవిష్యత్తు నాయకుడిగా నిలబెట్టాలి. అందుకోసమేనేమో ఈ మధ్య లోకేష్ ను సానబట్టే పనిలో పడ్డట్టు తెలుస్తుంది చంద్రబాబు.

 

2014 ముందు వరకు పార్టీ అంతర్గత విషయాల్లో మాత్రమే పాలుపంచుకున్న లోకేష్ ఎన్నికల్లో విజయం అనంతరం పూర్తిస్థాయి రాజకీయ వేదిక మీదకి వచ్చేశారు. చంద్రబాబు కూడా కొడుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్చను కూడా ఇచ్చారు. అప్పుడంటే అధికారం చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి లోకేష్‌ కు అన్నీ అలవోకగా కలిసొచ్చాయి. కానీ 2019 ఎన్నికల్లో ఘోర ఓటమితో తెలుగుదేశం అన్ని విధాలా కుంగిపోయింది. చంద్రబాబే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. దాంతో లోకేష్ సైతం సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా టీడీపీ కీలక నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలు అరెస్ట్ కావడంతో టీడీపీలో అలజడి నెలకొంది. దీంతో నేతలంతా ఎవరికి వారే అన్నట్టు దూరంగా ఉంటున్నారు. ఒక రకంగా ఇది సంక్షోభమనే అనుకోవాలి.

 

కానీ కష్టాల్లో కూడా అవకాశాలు వెతుక్కునేవాడే పైకి లేచి నిలబడగలడు అనే సిద్దాంతాన్ని చంద్రబాబు బాగా నమ్ముతారు. గతంలో పలుసార్లు ఈ సిద్దాంతాన్ని ఫాలో అయ్యారు కూడ. ఇప్పుడు అదే ఫార్ములాను కొడుకు లోకేష్‌ పై అప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది బాబు. ఈ కష్టకాలంలో పోరాడితేనే మంచి గుర్తింపు వస్తుందని ప్రధాన కార్యకలాపాలకు లోకేష్‌ ను ముందుంచుతున్నారు. ఇటీవలే వైసీపీ సంవత్సర కాలం పాలన మీద ప్రెస్ మీట్ పెట్టి పెద్ద తప్పుల చిట్టాను లోకేష్‌ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అలాగే ఇప్పుడు అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి అనంతపురానికి లోకేష్ నే పంపారు. ప్రధాన ప్రెస్ మీట్లలో కూడా ఆయనే పాల్గొంటున్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు లోకేష్‌ ను నాయకుడిగా తీర్చిదిద్దటానికి, సంక్షోభాల్లో ఎలా నిలబడాలో నేర్పడానికి అతన్ని రాజకీయాల్లోకి పూర్తిగా ముంచేశారు అని తెలుస్తుంది. మరి చంద్రబాబు ఆయన నమ్మిన సిద్దాంతాన్ని కొడుకుపై ప్రయోగించి టీడీపీకి ఒక కొత్తరకమైన భవిష్యత్తు నాయకుడిని ఇస్తాడేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: