మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  అరెస్టు విషయాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో  వైసిపి ఫెయిలైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మామూలు జనాలకే కాదు పార్టీ క్యాడర్ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది.  దాదాపు రూ. 150 కోట్ల  ఇఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రిని ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఎప్పుడైతే కింజరాపు అరెస్టయ్యాడో అప్పటి నుండి చంద్రబాబునాయుడు మూడు అశాలమీద నానా గోల చేస్తున్నాడు. అచ్చెన్న గురించి  చంద్రబాబు చెబుతున్న మూడు అంశాలు ఏవంటే మొదటిదేమో బిసిఅని, రెండోదేమో అనారోగ్యంతో ఉన్నాడని, మూడోదేమో కుంభకోణంలో అధికారుల పాత్రే తప్ప మంత్రిగా పనిచేసిన అచ్చెన్నకు సంబంధం లేదని.

 

నిజానికి చంద్రబాబు లెవనెత్తిన మూడు అంశాలు కూడా చాలా పనికిమాలినవనే  చెప్పాలి. ఎలాగంటే అవినీతికి కులం లేదు మతం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కుంభకోణంలో ఇరుక్కున్న అచ్చెన్న అరెస్టయితే బిసి సామాజికవర్గాల్లో ఎవరు కూడా పట్టించుకోలేదు. పైగా  కుంభకోణంలో ఇరుక్కున్న అచ్చెన్నను వెనకేసుకొచ్చే సమస్యే లేదని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు స్పష్టం చేశాడు.  కాబట్టి బిసి కార్డూ పనిచేయలేదు. ఇక అనారోగ్యం అనే విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. సో ముచ్చటగా మిగిలిపోయిన మూడో అంశం ఏమిటంటే కుంభకోణంలో అచ్చెన్నకు సంబంధమే లేదని.

 

మూడో అంశాన్నే ఇపుడు చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నాడు. అయితే ఈ అంశాన్ని తిప్పికొట్టడంలోనే వైసిపి నేతలు పూర్తిగా విఫలమైనట్లు అర్ధమవుతోంది. ఎలాగంటే అచ్చెన్న మంత్రిగా ఉన్న శాఖలో భారీ కుంభకోణం జరిగితే అచ్చెన్నకు సంబంధం లేదని చంద్రబాబు వాదిస్తున్నదే నిజమనుకుందాం. మరి ఇదే సూత్రం జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది కదా. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ లక్ష కోట్ల రూపాయలు సంపాదించాడని కదా సంవత్సరాలుగా చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియా గోల గోల చేస్తున్నది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉన్నపుడు జగన్ కనీసం వార్డు సభ్యుడుగా కూడా లేడన్న విషయం అందరికీ తెలిసిందే.

 

మరి వార్డు సభ్యుడుగా కూడా లేని జగన్ లక్ష కోట్ల రూపాయలు ఎలా దోచుకున్నాడు ?  అలాగే అప్పట్లో జరిగినట్లుగా చంద్రబాబు చెబుతున్న కుంభకోణాలకు వైఎస్సార్ కూడా కారణం కాదు కదా ? అప్పుడు కూడా అధికారులే దోచేసుకున్నారు. మరలాంటపుడు అధికారులపైన సిబిఐ కేసులు పెట్టి విచారించి జైళ్ళకు పంపితే చంద్రబాబు ఎందుకు జగన్ పై ఆరోపణలు చేస్తున్నాడు ?  చంద్రబాబు మాటల్లోనే అచ్చెన్నకు వర్తించే చట్టమే అప్పట్లో జగన్ కు కూడా వర్తించాలి కదా ? చట్టం ఇద్దరికీ ఒకే విధంగా ఉంటుంది కానీ వ్యక్తికొక చట్టం ఉండదు కదా ?

 

అడ్డుగోలుగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టడంలోనే వైసిపి నేతలు ఫెయిలైనట్లు అందరూ ఫీలవుతున్నారు. అధికారపార్టీ నేతల ఫెయిల్యూర్ ను సోషల్ మీడియాలో జగన్ అభిమానులు బాగా ఎండగడుతున్నారు. జగన్ పై ఆరోపణలను తిప్పికొట్టడంలో అయినా, చంద్రబాబు ఆరోపణలను ఎండగట్టడంలో అయినా వైసిపి నేతలకన్నా సోషల్ మీడియానే బాగా చురుగ్గా పనిచేస్తోందనటంలో ఎటువంటి సందేహం లేదు. మరిప్పటికైనా మంత్రులు, ఎంఎల్ఏలు వాస్తవాలను గ్రహించి గట్టి కౌంటర్లు మొదలుపెడతారా ? చూద్దాం ఏం చేస్తారో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: