ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..?  సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబుకి చెక్ పెట్టేందుకు కేంద్ర పెద్దలు రంగం సిద్ధం చేశారా..? ఇందుకోసం ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చనన్నారా..? అనే అవుననే తెలుస్తుంది.

 

మొన్నటివరకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ను మార్చి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో పార్టీ క్యాడర్ లో కొంచం కొత్త ఉత్సాహం వచ్చినట్టు భావిస్తున్నారు కేంద్ర పెద్దలు. దీంతో ఇప్పుడు వారి చూపు ఆంధ్రప్రదేశ్ పై పడినట్టు సమాచారం. అయితే ఏపీలో మాత్రం అధినాయకత్వానికి సరైన నాయకులు దొరకడం లేదట. ఇప్పటివరకు ఉన్న నేతలంతా పార్టీ వాదనను బలంగా వినిపించలేకపోయారన్న అసంతృప్తి ఇటు క్యాడర్ తో పాటు అటు కేంద్రంలో కూడా కలిగింది. దీనికోసమే ఒక బలమైన నాయకుడి కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

 

ఒకవేళ ఈయనను మారిస్తే మాత్రం పురంధేశ్వరి, సుజనా చౌదరీ, సోము వీర్రాజు లాంటి నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో ఇంకా బలమైన నాయుకుడి అవసరం పార్టీకి ఉందని కేంద్ర పెద్దలు అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఎవరూ ఊహించని పేరును పరిశీలిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కమలం పార్టీకి మద్దతు పలకడంతో కాపు ఓట్లు తమకే అని ఫిక్స్ అయిన పెద్దలు ఆ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వనవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారట. ఇక కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను చూస్తే చంద్రబాబు, జగన్‌కు ధీటైన నాయకుడు కనిపించడం లేదు.

 

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించినట్టు రాజకీయ వర్గాల్లో టాక్. అందుకోసం బీజేపీ అధిష్టానం రాజులను ఎంచుకుందట. దీంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరు తెరపైకి వచ్చింది. ఈపాటికే ఆయన వైసీపీతో తెగదెంపులు చేసుకున్నట్టు తెలుస్తుంది, కాగా.. రేపో మాపో ఆయనపై వేటు తప్పదు.. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకి వచ్చేస్తారు. అలాగే బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న నేపధ్యలో ఆయన బీజేపీలోనే చేరే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

పైగా రఘురామ కృష్ణంరాజు సామాజిక వర్గంగా, ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో ఆయన పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిశీలిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పైగా ఇలాంటి ఓ బలమైన సామాజిక వర్గానికి కీలక పదవి ఇవ్వడం ద్వారా ఏపీ బీజేపీ మరింత ఎదిగే అవకాశం ఉందని పార్టీ భావిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: