దేశంలో అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గుడి, బడి, ఇల్లు, ఆఫీసు ఇలా తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోతున్నాయి కొన్ని మానవ మృగాలు. వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన పసికందు నుంచి, కాటికి కాలు చాచిన పండు ముసలి వరకు ఎవరిని వదలట్లేదు ఈ కమాంధులు. దేశంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన ఇంకా మదిలో మెదులుతూనే ఉంది..ఆమె అరుపులు ఇంకా మన చెవుల్లో ధ్వనిస్తూనే ఉన్నాయి. ఇంకా అలాంటి నిర్భయల కేకలు నిరంతరం దేశంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకోచ్చినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆడదాని మానాన్ని మాత్రం కాపాడలేక పోతున్నారు. తాజాగా ల‌క్నో - మ‌థుర ర‌హ‌దారిపై జరిగిన ఘటనే దీనికి నిదర్శనం.

 

ప్ర‌తాప్‌ఘ‌ర్ కు చెందిన ఓ వివాహిత(25) త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఏసీ స్లీప‌ర్ బ‌స్సులో బుధ‌వారం రాత్రి నోయిడాకు బ‌య‌ల్దేరింది. కరోనా వైరస్ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అతి తక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అందరూ నిద్రపోయిన తరువాత అర్దరాత్రి 2 గంటల సమయంలో ఆమెను కత్తులో బెదిరించిన ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణాన్ని ఏదో సినిమా చూసినట్టే చూశారు తప్పా. ఆపడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆమె ఇద్దరు పిల్లల ముందే ఇంత దారుణం జరిగింది. మొత్తానికి బ‌స్సు దిగిన త‌ర్వాత బాధితురాలు గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

ఇలాంటి ఘటనలు జరిగితే రోడ్డుపైకి వచ్చి కేకలుపెట్టడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం, నిరసనలు తెలపడం, టీవీ ఛానల్లో చర్చలు జరపడం.. ప్రభుత్వాన్ని తిట్టుకోవడం ఇదేనా మనం చేసేది.. కంటి ముందు జరుగుతున్న దారుణాన్ని అపాల్సిన బాధ్యత మనది కాదా..? ఆ మహిళపై అంత దారుణం జరుగుతుంటే ఆపకుండా చోద్యం చూసినట్టు చూసిన ఆ చావచచ్చిన మనుషులని ఏం అనాలి..? ఈ పాపంలో వాళ్ళ పాత్ర లేదా..? కన్న తల్లిని తమ కళ్ల ముందే చేరుస్తుంటే ఆ పసి హృదయాలు ఎంతలా విలవిలలాడాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఘటనలు చూసిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలా మారుతారో మీరే ఆలోచించుకోండి. తమ తల్లిని కాపాడలేని ఈ సమాజం మీద ఆ పిల్లలు ఎలాంటి కక్ష పెంచుకుంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఇకనైనా మారండి.. కాదు, కాదు.. ఇకనైనా మారుదాం. కంటి ముందు జరిగే దారుణాన్ని అరికడదాం.

మరింత సమాచారం తెలుసుకోండి: