ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టిన సందర్భాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కరోనా వైరస్ సమస్య మొదలైన కొత్తల్లో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసిన  స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిపై మరోసారి మీడియా సమావేశంపెట్టాడు. ఇతరత్రా సందర్భాలను కూడా కలుపుకుని మహా అయితే మరో రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టుంటే చాలా ఎక్కువ. జగన్ ఎందుకు మీడియాకు దూరంగా ఉంటున్నాడు ? ఎందుకంటే ప్రెస్ మీట్ల పెట్టి తన గురించి తాను చెప్పుకోవటం కన్నా తన చేస్తున్న  పనులే తన గురించి చెబుతాయని నమ్ముతున్నాడు కాబట్టే.

 

సీన్ కట్  చేసి ఓసారి చరిత్రలోకి వెళదాం. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో కొన్ని వేలసార్లు మీడియా సమావేశాలు పెట్టుంటాడు. ప్రతిచిన్న విషయానికి గంటల తరబడి మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడటం చంద్రబాబుకు అలవాటైపోయింది. చేసింది గోరంతైనా చెప్పుకున్నది కొండతగా తయారైంది చివరకు చంద్రబాబు పరిస్ధితి.  ఐదేళ్ళయ్యేసరికి  ’ఓవర్ పబ్లిసిటి..నెగిటివ్ పబ్లిసిటి’ అయిపోయింది. దాంతో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు.

 

అయితే చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చినా వైఖరిలో మాత్రం మార్పురాలేదు. ప్రతిరోజు మీడియాలో కనబడకపోతే అన్నం సహించదు, నిద్ర పట్టదు అనే స్ధాయికి వెళ్ళిపోయాడు. దానికితోడు చంద్రబాబు అండ్ కో  విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. అదేమటంటే జగన్ మీడియా సమావేశాలు ఎందుకు పెట్టటం లేదు ? అని. ప్రతి చిన్న విషాయానికి పెద్దగా యాగీ చేయటం గోల చేసి దమ్ముంటే జగన్ తమకు సమాధానం చెప్పాలని అడగటం మామూలైపోయింది. చంద్రబాబు అండ్ కో ఎంత రెచ్చగొడుతున్నా జగన్ మాత్రం తన పనేదో తాను చేసుకునిపోతున్నాడు.

 

తాజాగా మాజీమంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్టు విషయంలో చంద్రబాబు అండ్ కో జగన్ ను ఎంతగా రెచ్చగొడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూస్తుంటే జగన్ మౌనమే చంద్రబాబుతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను బాగా రెచ్చ గొడుతోందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.  చంద్రబాబేమో ఓవర్ పబ్లిసిటి కోరుకునే వ్యక్తయితే జగన్ ఏమో అసలు పబ్లిసిటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లున్నాడు.

 

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని  తన ఆరోపణలకే జగన్ సమాధానం చెప్పడా అంటూ చంద్రబాబు రోజూ మండిపోతున్నాడు.  ఇక్కడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తన స్ధాయికి తగ్గట్లుగా నడుచుకుంటున్నాడా ? అనే అనుమానం వస్తోంది అందరిలోను.  ప్రతిరోజు మీడియాలో కనబడాలన్న యావతో తన స్ధాయిని తానే  దిగజార్చేసుకున్న చంద్రబాబు తనలాగే జగన్ కూడా దిగజారిపోవాలని కోరుకుంటున్నట్లున్నాడు.

 

ఇక్కడ చంద్రబాబు మరచిపోయిన విషయం ఒకటుంది. సిఎం అయిన తర్వాతే కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ మీడియా సమావేశాలు పెట్టిన సందర్భాలు తక్కువే. ఏదున్నా పార్టీ నేతలతో మాట్లాడుతున్నాడు.  తర్వాత నేతలే మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలకు సమాధానాలు చెబుతున్నారు.  మొత్తం మీద అప్పుడే కాదు ఇపుడు కూడా జగన్ మౌనమే ప్రతిపక్షాల నేతలను బాగా రెచ్చగొడుతున్నట్లుంది చూస్తుంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: