టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీల మధ్య వైసీపీ చిచ్చు పెట్టిందా..? వైసీపీ పెద్దల సహకారంతోనే  ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్లకుండా పోయిందా..? మొన్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలే ఈ అనుమానలకి దారి తీస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

 

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు చెల్లని ఓట్లు పడ్డ సంగతి అందరికీ తెలిసిందే.. అందులో ఒకటి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీదన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే భవానీ చేసిన పనికి ఆమెపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో మొన్న సాయంత్రం నుంచి రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.. ఆదిరెడ్డి భవానీ కావాలనే ఇలా చేశారని కొందరు, లేదు ఆమె టీడీపీని విడబోతుందని ఇంకొందరు ఇలా ఎవరికి వారే ఊహించేసుకొని పుకార్లు సృష్టించారు.

 

దీంతో ఏకంగా ఆదిరెడ్డి భవానీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరపాటుబడ్డానని, అందుకే ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, అయితే, అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టవచ్చా అని అడిగితే వారు ఓకే చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

 

ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. దీంతో చంద్రబాబు ఆమెపై మరోసారి సీరియస్ అయ్యారట. తెలియకపోతే మనవాళ్ళని అడగాలి గాని వేరే ఎవరినో అడగటం ఏంటి అని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు అన్న మాటలకి ఆమె కూడా బాధ పడ్డట్టు తెలుస్తుంది. దీంతో టీడీపీ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. వైసీపీ పెద్దలు ముందుగానే లోపల ఉన్న సిబ్బందితో కుమ్మక్కైయ్యారట. ఒకవేళ టీడీపీ నేతలు ఎవరన్నా వచ్చి సందేహాలు అడిగితే వారికి రాంగ్ గైడెన్స్ ఇవ్వాలని సూచించారట. దీంతో ఆదిరెడ్డి భవానీ తనకి తెలియకుండానే వైసీపీ పన్నిన వ్యూహంలో ఇరుక్కున్నారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: