గడచిన ఏడాదికాలంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమపథకాలు ఎన్నంటే ఠకీమని ఎవరూ చెప్పలేరు. దేశంలో ఏ రాష్ట్రంలోను కరెక్టుగా చెప్పాలంటే ఏపిలో గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా అమలు చేయనన్ని పథకాలు అమలు చేస్తున్నాడు. ప్రతి నెలా ఏదో ఓ పథకంలో కోట్లాదిమంది లబ్దిదారులకు డబ్బులు అందుతునే ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏడాదిలో 3.9 కోట్లమంది లబ్దిదారులు ఏదో ఓ పథకంలో డబ్బులు అందుకున్నారు. మరి సంక్షేమ పథకాల అమలులో ఇంత ఘనమైన రికార్డును సొంతం చేసుకున్న జగన్ కు ఏ స్ధాయిలో జనామోదం లభించాలి ?  

 

కానీ  సిపీఎస్ అనే సంస్ధ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైన ఫలితాలు పెద్దగా ఉత్సహాన్ని ఇవ్వటం లేదనే చెప్పాలి. జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీపిఎస్ సంస్ధ ప్రజల్లో తిరిగి సర్వే నిర్వహించింది. జగన్ పాలన ఎలాగుంది అనే విషయంలో 62.6 శాతం మాత్రమే బాగుందని అభిప్రాయపడ్డారు. 36.1 శాతం మంది బాగాలేదని పెదవి విరిచారు.  అంటే జగన్ పాలన బాగాలేదన్న జనాల శాతం 36 శాతమంటే తక్కువేమీ కాదని గమనించాలి. పార్టీలకు అతీతంగా, కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రభుత్వం చెప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇటువంటి పరిస్ధితుల్లో కూడా 36 శాతం మంది జగన్ పాలన బాగాలేదని చెప్పారంటే అర్ధమేంటి ? వాళ్ళంతా ప్రతిపక్షాలకు మద్దతిస్తున్న లబ్దిదారులా ? లేకపోతే వాళ్ళకు ప్రభుత్వ పథకాలేవీ అందటం లేదా ? ఇక ప్రాంతాలవారీగా తీసుకుంటే జగన్ పాలన బాగుందని చెప్పినవారిలో  రాయలసీమలో 67.1 శాతమే. పోయిన ఎన్నికల్లో రాయలసీమలోని  52 సీట్లలో వైసిపి 49 సీట్లు గెలుచుకుంది. అంటే దాదాపు 95 శాతం మంది జనాలు వైసిపికి ఓట్లేశారు. జగన్ సిఎం అయిన తర్వాత జనామోదం మరింతగా పెరిగిందని అధికారపార్టీ అనుకుంటోంది.  మరి అలాంటిది జగన్ పాలన బాగాలేదని 31.9 శాతం మంది అభిప్రాయపడుతున్నారంటే ఆలోచించాల్సిందే.

 

అయితే ఇక్కడ జగన్ కు సానుకూలంగా ఉండే  విషయం కూడా ఒకటుంది. అదేమిటంటే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత కూడా అమరావతి ప్రాంతంలో 54.9 శాతం జనాలు సానుకూలంగా ఉండటం ఆశ్చర్యమే. అయితే జగన్ పై ఇక్కడ వ్యతిరేకత కూడా  42.1 శాతం ఉందని గుర్తుంచుకోవాలి. అలాగే పార్టీల పనితీరు విషయంలో కూడా వైసిపికి 55.9 శాతంమంది జనాలు సానుకూలంగా ఉన్నారు. ఇదే సమయంలో 38.3 శాతంమంది టిడిపికి అనుకూలంగా ఉన్నారు.  పోయిన ఎన్నికల్లో టిడిపికి వచ్చిన ఓట్లు దాదాపు ఇంతే.  అంటే జగన్ ఏడాది పాలన  తర్వాత కూడా టిడిపికి జనాల మద్దతులో తగ్గుదల ఏమీ  లేదని అర్ధమవుతోంది. ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండకపోతే కష్టమనే అనిపిస్తోంది.

 

ఎందుకంటే కాలం గడిచేకొద్దీ అధికారపార్టీపై జనాల్లో వ్యతిరేకత పెరగటం సహజం. కాబట్టి జనాల్లో పెరిగే వ్యతిరేకత టిడిపి వైపు మొగ్గితే వైసిపికి కష్టాలు మొదలైనట్లే. ఇక జనసేన +బిజెపి వైపు జనాల మొగ్గు 5.3 శాతం మాత్రమే ఉంది. అయితే ఈ లెక్కలన్నీ తారుమారు అయ్యేందుకు చాలా అవకాశాలున్నాయి. ఎందుకంటే షెడ్యూల్డ్ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ కాలముంది. పాలనలో అనుభవం తెచ్చుకుని సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిలో కూడా జగన్ తనదైన ముద్ర చూపిస్తే జనాల మూడ్ మారచ్చు.

 

అదే సమయంలో  పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే కూడా జనాల్లో జగన్ పాలనపై సానుకూలత పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కనపెడితే రాజకీయంగా వివిధ పార్టీల్లో ఎప్పుడే  డెవలప్మెంట్ జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏదేమైనా ఇప్పకిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపినే గెలుస్తుందని 55.8 శాతం అభిప్రాయపడటం గమనార్హం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: