ఆయా ప్రాంతాల్లో వైరస్ కేంద్రాలను గుర్తిస్తున్న ప్రభుత్వం .. అక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్ప‌టికే 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రీక్ష‌ల‌కు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప్రైవేటు ల్యాబుల‌కు కూడా అనుమ‌తులు ఇవ్వ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. దీంతో అదే స్థాయిలో నిర్ధార‌ణ కేసులు కూడా బ‌య‌ట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా 450కి పైగా గ‌త ఐదు రోజులుగా కేసులు న‌మోద‌వుతూ వ‌స్తునే ఉన్నాయి. దీంతో జీహెచ్ఎంసీ ప‌రిధిలోని జ‌నాల వెన్నులో వ‌ణుకు పుడుతోంది.  జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.


ఇక తక్కువ కేసులున్న ప్రాంతాల్లో పాజిటివ్‌ వ్యక్తులున్న ఇళ్లకు  మూడు  కిలోమీటర మేర హాట్‌ స్పాట్‌గా ప్రకటించి కంటైన్మెంట్‌ ప్రణాళికను అమలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏరియాల్లో ఇంటింటికి వెళ్లి లక్షణాలున్న వారికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో సోమ‌వారం ఒక్క‌రోజే కొత్తగా 872 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో  8674 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఇప్పటి వరకు 217 మంది మృతి చెందార‌ని తెలిపారు. అలాగే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినవారు 4005 మంది కాగా ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్  కేసుల సంఖ్య 4452గా ఉన్న‌ట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.


ఇదిలా ఉండ‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే 90శాతం కేసులు న‌మోదై ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకు వ‌చ్చే అంశంపై ప్ర‌భుత్వం పునఃప‌రిశీలన చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం చాలా మంది వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌రీక్ష‌ల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెంచాల‌ని సూచిస్తున్నారు. తమిళనాడులో విపరీతంగా కేసులు పెరుగుతుండటంతో గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు హైద‌రాబాద్‌లో కూడా లాక్‌డౌన్ అమ‌లు చేస్తేనే బాగుంటుంద‌ని సామాన్య ప్ర‌జానీకం అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: