ఎట్టకేలకు సీఎం జగన్ కళ్ళు తెరిచారు. పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల అసమ్మతి గళంతో ఆయనకు కనువిప్పు కలిగింది. ఇకపై అంతా శభమే.. ఇది నేనంటున్న మాట కాదు. వైసీపీ వర్గాలు అంటున్న మాట.

 

2019 లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ దర్శనం సొంత పార్టీ నేతలకే కరువైంది. దీనికి కారణం ఆయన నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండటం. దీంతో సొంత నాయకులే ఆయనపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కొంతమంది ఈ విషయాన్ని నేరుగానే చెప్పేశారు. మరికొంతమంది ఏకంగా పార్టీపై విమర్శలే చేశారు. దీంతో జ్ఞానోదయం తెచ్చుకున్న సీఎం జగన్ ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసేందుకు నిర్ణయించుకున్నారట.

 

ఇదే విషయాన్ని నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. తాను మొదటి నుంచి ఇదే మాట సీఎం జగన్ కు చెప్తున్నానని.. కానీ, ఇంత కాలానికి తన సూచనను పరిగణనలోకి తీసుకున్నందుకు సంతోషమని రఘురామకృష్ణంరాజు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే త్వరలో తనకు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమయం ఇస్తారని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఆయన మాట సంగతి అలా ఉంచితే...

 

వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలవలేదు. చాలా మంది ఆయన అప్పాయింట్ మెంటు అడిగి లేదనిపించుకున్నారు. కొందరు అప్పాయింట్ మెంటే అడగలేదు. దాదాపు 60 నుంచి 70 శాతం మంది ఎమ్మెల్యేలు తొలి సారి ఎన్నికైన తర్వాత జరిగిన సమావేశంలో కాకుండా మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవలేదు. దీనిపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పైగా ఎవరైనా సరే ఆయన పిలిస్తేనే వెళ్లాలి అనే నిబంధన ఉండటంతో ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు అసమ్మతి గళం కూడా వినిపించారు.

 

అయితే ఎట్టకేలకు ఈ కారణం వల్లనో ఏమో కానీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కలవాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. మరి ఈ కలయిక తర్వాత గుర్రుగా ఉన్న నేతలు అలక వీడుస్తారా.. పార్టీ కార్యక్రమాల్లో ఆక్టివ్ గా ఉంటారా. లేక కొత్త షరత్తులు ఏమన్నా పెడతారా. అనే ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల నుంచి తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పార్టీకి ఎంతోకొంత మంచే జరుగుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: