తాను ప్ర‌తిష్టాత్మకంగా భావించిన మూడు రాజ‌ధానుల విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా ఈ నిర్ణ‌యంలో మార్పు ఏమైనా చేసుకున్నారా?  మూడు రాజ‌ధానుల‌ను కొన‌సాగిస్తూనే .. ప్ర‌జ‌ల అభిరుచికి, వారి డిమాండ్‌కుత‌గిన విధంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త సీఎం చంద్ర‌బాబు.. అమరావ‌తి రాజ‌ధానిని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించారు. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా దీనిని తీర్చిదిద్దుతాన‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర మంలోనే సింగ‌పూర్ ప్ర‌ణాళిక‌ల‌తో ప్ర‌చారం చేసుకున్నారు. 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో సా ధించామ‌ని చెప్పారు.

 

ఇంతా చేస్తే.. ఆయ‌న ఐదేళ్ల‌కాలంలో ఇక్క‌డ చేసింది కేవ‌లం తాత్కాలిక భ‌వ‌నాల నిర్మాణాలే. ఇక‌, శాశ్వ‌త నిర్మాణాలు చేప‌ట్టేందుకు ఇప్ప‌ట్లో నిధులు కూడా చాల‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అధికారం లోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇంత ఖ‌ర్చు పెట్టి.. రాజ‌ధాని క‌ట్ట‌లేమ‌ని, ఇప్ప‌టికే అభివృద్ధి చెందిన విశాఖ‌ను రాజ ధానిగా చేసుకుందామ‌ని, అయితే, అమ‌రావ‌తిలోనే శాస‌న స‌భ ఉంటుంద‌ని, క‌ర్నూలులో న్యాయ రాజ‌ధా నిని ఏర్పాటు చేద్దామ‌ని తెలిపారు. దీనిపై విమ‌ర్శ‌లు, హైకోర్టులో కేసులు దాఖ‌ల‌య్యాయి. పైగా శాస‌న మండ‌లిలో మూడు రాజ‌ధానుల బిల్లును టీడీపీ అడ్డుకుంటోంది. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ త‌న వ్యూహాన్ని మార్చుకున్నారు.

 

అమ‌రావ‌తి ప్ర‌జ‌లు, రైతుల ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇక్క‌డ పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా.. ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌, రోడ్లు వంటివి త్వ‌ర‌లోనే చేప‌ట్టి పూర్తి చేయాల‌ని, అదేస‌మ‌యంలో రైతుల‌కు ఇక్క‌డ ఇస్తామ‌ని చెప్పిన అభివృద్ది చెందిన ప్లాట్ల‌ను కూడా అభివృద్ది చేసి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ ప్ర‌ణాళిక‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి.. త్వ‌ర‌లోనే రైతుల‌ను సంతృప్తి ప‌రిచి.. ఇంట గెలిచి.. ర‌చ్చ‌గెల‌వాల‌నే సూత్రాన్ని అవ‌లంబించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌ర‌గుతోంది. మ‌రి ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: