ముగ్గురు ప్రముఖులు హైదరాబాద్ లోని ఓ హోటల్లో సమావేశమైన విషయం ఇపుడు ఏపిలో సంచలనంగా మారింది. ఈ నెల 13వ తేదీన పార్క్ హయత్ హోటల్లో బిజెపి ఎంపి సుజనా చౌదరి, మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటి అయిన విషయం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.  భేటి పై చిత్రవిచిత్రమైన వాదనలు వినబడతుండటంతో రాజకీయ రచ్చ మరింత పెరిగిపోతోంది.  వీళ్ళ సమావేశంపై టిడిపి ఒక వాదన వినిపించగా సుజనా మరో వాదన వినిపించటం గమనార్హం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే సుజనా, కామినేని బిజెపి నేతలు. కాబట్టి వాళ్ళ భేటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళతో పాటు నిమ్మగడ్డ కూడా భేటి అవ్వటమే ఆశ్చర్యంగా  ఉంది.  హోటల్ గదిలో  వీళ్ళ భేటికి సంబంధించిన వీడియోలు లేనప్పటికీ, హోటల్లోకి ముగ్గురు ఒకళ్ళ తర్వాత మరొకళ్ళు వెళ్ళటం, తర్వాత గదిలో గంటన్నరపాటు భేటి అవ్వటమే అనేక అనుమానాలకు తావిచ్చింది. ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటపడిందో సహజంగానే మంత్రులు, వైసిపి ఎంఎల్ఏలు వీళ్ళపై రెచ్చిపోయారు.  వైసిపి చేసిన ఆరోపణలన్నీ సుజనా, కామినేని, నిమ్మగడ్డ మీదే కాబట్టి స్పందించాల్సిన బాధ్యత కూడా వీళ్ళపైనే ఉంటుంది.

 

అయితే ఇక్కడ విచిత్రంగా టిడిపి స్పందించింది. పార్టీ అధికారప్రతినిధి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ వీళ్ళ భేటిని సమర్ధించారు. అసలు స్పందించాల్సిన వాళ్ళు స్పందించకుండా మధ్యలో టిడిపి ఎందుకు స్పందించిదన్నది ప్రశ్న. పైగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించటానికే భేటి అయినట్లు వర్ల చెప్పటం మరీ విచిత్రంగా ఉంది. రాష్ట్రప్రభుత్వ వైఖరిపై వీళ్ళేమీ చర్చించుకుంటారు ?  చర్చించినా  వీళ్ళేమి చేయగలరు ?  అంటే వర్ల చెప్పినదాంట్లో నిజం లేదని తెలిసిపోతోంది.  మరి నిజం ఏమిటి ? అన్నదే ఇపుడు తేలాల్సింది.

 

ఇక ఇదే సమయంలో వీళ్ళు ముగ్గురు గదిలో నుండి బిగ్ బాస్ తో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడినట్లు  వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించాడు. మరి బిగ్ బాస్ ఎవరు ? విజయసాయి చెప్పకపోయినా బిగ్ బాస్ ఎవరో అందరూ ఊహించగలరు. నిజానికి వీళ్ళ ముగ్గురికి కామన్ పాయింట్ చంద్రబాబునాయుడే అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు.  సామాజికవర్గం ఒకటే కావటంతో పాటు ముగ్గురు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావటం గమనార్హం. కాబట్టే వీళ్ళ భేటి ఇంత సంచలనంగా మారింది.

 

భేటి విషయంలో సుజనా మాట్లాడుతూ  తమ భేటిలో ఎటువంటి ప్రత్యేకత లేదని కొట్టిపడేశాడు. నిమ్మగడ్డ, కామినేని విడివిడిగానే అపాయిట్మెంట్లు తీసుకుని తనను కలిసినట్లు చెప్పాడు. అపాయిట్మెంట్లు విడివిడిగా తీసుకోవటం వరకు ఓకే. కానీ గదిలో ముగ్గురు కలిసి దాదాపు గంటన్నరపాటు భేటి అవ్వటం మాటేమిటి ?  ముగ్గురు కూడా రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకమన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. మరి అటువంటి వాళ్ళు భేటి అయ్యారంటే రాజకీయంగా కలకలం రేపకుండా ఎలాగుంటుంది ? మరి తాజా వివాదానికి ముగింపు ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: