ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే బర్ర బద్దలైపోతుంది. అసలు ఎవరితో ఎవరు కలుస్తున్నారు.. ఎవరిని ఎవరు తిడుతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో అర్ధం కావట్లేదు. అలాగే ఎవరు ఎవరి మాట వింటున్నారో కూడా అర్ధం కావట్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి కూడా ఇలానే ఉంది. సీఎం జగన్ ఒక మోనార్క్.. ఎవరి మాటా వినడు.. తనకు నచ్చిందే చేస్తాడు. ఇది వైసీపీ వర్గాల్లో, అలాగే ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించే టాక్. కానీ, ఈ మధ్య సీఎం జగన్ ని చూస్తుంటే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిందే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా అనడానికి చాలా కారణాలే ఉన్నాయిలేండి.

 

జగన్-పవన్.. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం కాయం. అంతలా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుంటారు. వీరు బద్ద శత్రువులేం కాదు.. కానీ, తమ సిద్ధాంతాల కారణంగా, రాజకీయాల కారణంగా అలా మారిపోయారు. ఒకరిపై ఒకరు కాలుదువ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా విమర్శించుకున్న రోజులు ఉన్నాయి. అయితే ఇవన్నీ గతం. ఇప్పుడు మాత్రం వీరి బంధం వేరేలా నడుస్తుంది. ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారు. ఒకరి మాటకు ఒకరు విలువనిచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాటలకి సీఎం జగన్ తెగ విలువిస్తున్నట్టు తెలుస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపధ్యంలో కూడా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని మొదట్లో భావించింది ప్రభుత్వం. అయితే దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. పిల్లల ప్రాణాలతో ఆడుకోవడం సరి కాదని, పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ వెంటనే ప్రభుత్వం కూడా కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సీఎం జగన్ సర్కార్ పై పవన్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు చేయాలని మంగళవారం నాడు సీఎం జగన్ ని కోరారు జనసేనాని. అంతే మంగళవారం సాయంత్రానికి ఆ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం.

 

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాటలకు జగన్ బాగానే విలువ ఇస్తున్నటు అర్ధం అవుతుంది. మరి పవన్ మాటలకి జగన్ ఇంత విలువ ఎందుకు ఇస్తున్నాడో అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కట్లేదు. మరోవైపు సీఎం జగన్ తీసుకోబోయే నిర్ణయాన్ని పవన్ ముందే తెలుసుకొని ఈ విధంగా రాజకీయ లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నాడా..? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ పెద్దలు. అలాగే సీఎం జగన్ కూడా రాజకీయ లబ్ధి లేంది ఏమీ చెయ్యడు.. కాబట్టి ఇందులో ఏదో అంతర్గత ఒప్పందం ఉండుంటుంది అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వీరి సరికొత్త బంధం ఎక్కడికి దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: