జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రాబోతున్నారా..? కేంద్ర పెద్దలు ఆయనకిచ్చిన ఆదేశాలు ఏంటి..? అందుకు సీఎం జగన్నే ఆదర్శంగా తీసుకోబోతున్నారా..? అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం..

 

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్.. 2014 లో ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీకి మద్దతు ఇచ్చి ఆ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవడం, అధికారాన్ని చేపట్టడం, ఆ తర్వాత కొన్ని పరిణామాల కారణంగా పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి విడిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి. దీంతో పవన్ దృష్టి 2019 ఎన్నికలపై పడింది. ఎలాగైనా ఎన్నికల్లో తన సత్తా చాటాలనుకున్నారు. అందుకే ఆ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా దిగారు. దీంతో బొక్కబోర్లా పడ్డారు. కేవలం ఒక్కే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఆ పార్టీ నుంచి గెలుపొందాడు. ఆఖరికి అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటమిపాలయ్యారు. దీంతో ఖంగుతిన్న జనసేనాని. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి, ఆ పార్టీకి మద్దతు పలికారు. ఇంచుమించుగా విలీనం లాంటిదే.. కానీ విలీనం కాదు.

 

అయితే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు పవన్. రీఎంట్రీ తరువాత పవన్ వరుస మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమా రాబోతుంది. క్రిష్ డైరెక్షన్లో సినిమా కూడా త్వరలో మొదలు కాబోతుంది, వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చెయ్యబోతున్నాడు. ఈ మూడు చిత్రాల తరువాత మరికొన్ని సినిమాల్లో నటించేందుకు పవన్‌ కల్యాణ్ ఆసక్తిని చూపుతున్నారని.. ఈ క్రమంలో దర్శకులు సైతం కథలను రెడీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ మూడు సినిమాల తరువాత పవన్ ను బ్రేక్ తీసుకోమని కేంద్ర పెద్దలు చెప్పినట్టు సమాచారం.

 

సినిమాలకు స్వస్తి పలికి.. 2024లో జరిగే ఎన్నికలకోసం పవన్ ను పాదయాత్ర మొదలుపెట్టమని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాదయాత్ర ద్వారా పవన్ ప్రజల్లోకి వెళ్తే ఎంతోకొంత లాభం చేకూరుతుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. దీనికి పవన్ సైతం సై అన్నట్టు తెలుస్తుంది. దీంతో కరోనా కష్టకాలం పూర్తి కాగానే పాదయాత్ర చేసేందుకు పవన్ రెడీ అయిపోయారట. అందుకు కావాల్సిన పనులు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. పాదయాత్ర ద్వారా అధికార పార్టీ అరాచకాలను, అవినీతిని పజల మధ్యలో పెట్టేందుకు పవన్ సిద్దమయ్యారట. అలాగే కేంద్రం పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఆదేశాలపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేల ఈసారి ఎన్నికలు ముందుగానే రాబోతున్నాయేమో.. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందేమో అని ఎవరికి వారు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: