151 సీట్లు గెల్చారు. తిరుగులేని మెజార్టీ సాధించారు. ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉన్నారు. కనుచూపుమేరలో అసంతృప్తి మాటే వినిపించడం లేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్నారు. ఏపీలో ఇంతవరకూ ఏ సర్కారు ఇవ్వని విధంగా వేల కోట్ల రూపాయలు పేదలకు పంచామంటున్నారు. వైసీపీ సర్కారుపై ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదని మంత్రులు చెప్పుకుంటున్నారు. కానీ పార్టీలో మాత్రం అంతర్గతంగా ఏదో జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.

 



వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు నేతలు పార్టీ తరపున బలమైన గొంతు వినిపించేవాళ్లు. వీరిలో చాలా మందికి అధికారంలోకి వచ్చాక సరైన ప్రాధాన్యత దక్కలేదనేది బహిరంగ రహస్యమే. వీళ్లలో ఎక్కువ మంది లోపల అసంతృప్తి ఉన్నా.. పైకి మాత్రం గుంభనంగా ఉంటున్నారని చెబుతున్నారు. సీనియర్లు కూడా మంత్రి పదవులు దక్కకపోవడంపై అంత హ్యాపీగా లేరు. తమకు పదవులు దక్కలేదనే విషయం కంటే.. తమ జూనియర్లను ఏరికోరి అందలం ఎక్కించడం వారికి అసలు మింగుడు పడటం లేదు. ఈ విషయంలో తమ అసంతృప్తి జగన్ దగ్గరకు తీసుకెళ్దామన్నా చాలా మందికి అపాయింట్ మెంట్ దక్కని పరిస్థితి ఉంది.

 



వైజాగ్ గ్యాస్ ఎపిసోడ్ లో విజసాయిరెడ్డికి అవమానం జరిగిందనే విషయం హైలైట్ అయింది. పైగా విజయసాయిరెడ్డిని తగ్గించి.. సజ్జలను పెంచుతున్నారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ టికెట్లు, చేరికల విషయంలో విజసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించగా.. ఇప్పుడు జిల్లాల్లో పార్టీ అసంతృప్తులు, గ్రూపుల వ్యవహారాలను సజ్జల డీల్ చేస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. దీనికి తోడు వైవీ సుబ్బారెడ్డి కూడా మంత్రాంగం నెరపుతున్నారు. వీరి ముందు విజయసాయిరెడ్డి తట్టుకోలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. అటు ఢిల్లీలో కూడా విజయసాయి అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోవడంతో... జగన్ ఆయన్ను క్రమంగా పక్కనపెడుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 


విజయసాయి రెడ్డి సంగతి పక్కనపెడితే రీసెంట్ గా తెరపైకి వచ్చిన రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కూడా వైసీపీకి తలనొప్పిగా తయారైంది. ఆయన్ను వెనుక నుంచి ఆడిస్తోంది బీజేపీయేనని చాలా మంది చెబుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంపై కూడా ఇలాగే చిన్నగా అసంతృప్తి జ్వాల రగిలించారని, ఆ తర్వాత దాన్నో పద్ధతి ప్రకారం పెంచారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా సేమ్ ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారనే వాదన ఉంది. అయితే జగన్ కు మోడీ, అమిత్ షా తో ప్రస్తుతానికి సత్సంబంధాలే ఉన్నాయని చెబుతున్నా.. కమలం పార్టీ మనసులో ఏముందేనది ప్రస్తుతానికి చిదంబర రహస్యమే.

 



అటు టీడీపీతో, ఇటు వైసీపీతో అవసరానికి తగ్గట్టుగా సంబంధాలు పెట్టుకుంటున్న బీజేపీ.. తనదైన గేమ్ ఆడుతోంది. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై ప్రధాన పార్టీలను కనుమరుగు చేసి.. కాషాయ జెండా బలంగా పాతాలనే వ్యూహంతో వెళ్తోంది. ఇదెంతవరకూ సాధ్యమనే విషయం పక్కనపెడితే... దీని కోసం వైసీపీలో అసమ్మతి స్వరాలను ఎగదోస్తోందని కొందరంటున్నారు. రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ శాంపిల్ మాత్రమేనని.. భవిష్యత్తులో మరింత మంది గళం విప్పుతారని ఇతర పార్టీలు అంటున్నాయి. మమరి ఈ వాదన ఎంతవరకూ నిజమౌతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: