వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ఏపీ రాజధాని ఏది అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వైజాగ్ తరలిస్తామని హడావిడి చేసిన వైసీపీ.. కరోనా రాకతో సైలంట్ అవ్వాల్సి వచ్చింది. దీనికి తోడు మండలిలో బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లడం, కోర్టులో కూడా విచారణ నడుస్తుండటంతో.. ఆటంకాలు తప్పలేదు. ఇవన్నీ ఉండగానే అసెంబ్లీలో రెండోసారి బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్నా.. ఎప్పటిలాగై మండలిలో మళ్లీ ఆగిపోయింది బిల్లు. దీంతో అసలు రాజధాని విషయంలో వైసీపీ వ్యూహమేమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. అంతకుముందు సచివాలయ ఉద్యోగులకు కూడా వైజాగ్ వెళ్లాల్సి ఉంటుందని సర్క్యులర్ జారీ చేశారనే ప్రచారం జరిగింది. కొందరు ఉద్యోగులు అంతర్గత సంభాషణల్లో కూడా ఇది నిజమే అని చెప్పారు. కానీ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే.. అమరావతి నుంచి కదిలే అవకాశాలు కనిపించడం లేదు. రాజధాని రైతులు ఆందోళన చేసినప్పుడు కూడా గ్రామాల వైపు మంత్రులు తొంగిచూడలేదు. ఉన్నట్టుండి పురపాలక శాఖ మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటించడం కొత్త చర్చకు దారితీసింది.



ఇప్పుడున్న పరిస్థితిలో రాజధాని మార్పు జరగదని కొందరు వైసీపీ మంత్రులు ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం విశాఖ పాలనా రాజధాని అవడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. అటు కార్యకర్తలు మాత్రం పూర్తిస్థాయి అయోమయంలో ఉన్నారు. అసలు రాజధాని కొనసాగుతుందా.. తరలిపోతుందా అనే విషయంలో ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మంత్రులు, ప్రజాప్రతినిధులకు స్థానికుల నుంచి సెగ తగులుతోంది. బయటకు కనిపించకపోయినా.. వచ్చిన రాజధానిని తరలిస్తుంటే చూస్తూ ఊరుకున్నారనే కోపం అక్కడి ప్రజల్లో ఉంది. అయితే అది ఓట్ల రూపంలో మారేంతగా ఉందా.. లేదా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.



మూడు రాజధానుల పేరుతో.. అన్ని ప్రాంతాల ఓట్లు పడతాయని, రాజధాని ప్రాంతంలో రెండు జిల్లాలు వ్యతిరేకమైనా నష్టం లేదని జగన్ సర్కారు భావించింది. కానీ ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత సంగతి పక్కనపెడితే.. తమను ఊరించి ఉసూరుమనిపించారని రాయలసీమ ప్రజల్లో ఓ వర్గం భావిస్తోంది. జ్యుడిషియల్ క్యాపిటల్ పేరుతో ఒరిగేదేమీ లేదని ఇప్పటికే వాదన ఉండగా.. ఇప్పుడు హైకోర్టు తరలింపు గురించి కనీసం ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదని కొందరు భావిస్తున్నారు. విశాఖకు రాజధాని తరలింపుపై మాట్లాడుతున్న మంత్రులు కూడా.. హైకోర్టు విషయంలో నోరెత్తకపోవడంపై సందేహాలున్నాయి.



అటు విశాఖ ప్రజల్లోనూ వారి అనుమానాలు వారికున్నాయి. విషవాయువు ఘటన జరిగిన తర్వాత.. రాజధానికి సాగర నగరం మాత్రం ఎంతవరకు సేఫ్ అనే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు విశాఖలో భూకుంభకోణానికి వైసీపీ నేతలు తెరతీశారనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఇక టీడీపీ హయాంలోనే ల్యాండ్ స్కామ్ పై ఇచ్చిన నివేదిక కూడా బయటకు రావాల్సి ఉంది. అమరావతిలో భూకుంభకోణాల పేరు చెప్పి రాజధాని తరలించాలనుకుంటున్న ప్రభుత్వం.. విశాఖలో ల్యాండ్ స్కామ్ గురించి ఏం చెబుతుందనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంత వీజీ కాదు.



ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో.. రాజధాని తరలింపు సాధ్యమేనా అనే ప్రశ్నలకు నిపుణులు సైతం సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల కోసం అభివృద్ధి నిధుల్లో కోత పెడుతున్న ప్రభుత్వం.. రాజధాని తరలింపు, విశాఖలో కొత్త భవనాల నిర్మాణం ఎలాగనే విషయంలో ప్రభుత్వానికీ క్లారిటీ లేదనే వాదనలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మొత్తం మీద రాజధాని వ్యవహారం వైసీపీలో కంగాళీగా తయారైందనే అభిప్రాయం వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: