రాజకీయం అంటేనే డబ్బు.. డబ్బు అంటేనే రాజకీయం. ఈ రెండిటికి విడతీయలేని బంధం ఉంది. అలాగే నేరచరిత్ర కూడా వీరికి బంధువే.. 

ఇటీవలే దేశవ్యాప్తంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపికైన ఎంపీలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా విశ్లేషణ నివేదికను విడుదల చేసింది. ఇందులో వీరికి సంబంధించిన అన్ని వివరాలను విశ్లేషించారు. ప్రస్తుతం వారి ఆస్తులు, అప్పులు, ఆదాయం, క్రిమినల్ కేసుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ నివేదికలో ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఇద్దరు ఎంపీలు రెండు వేర్వేరు అంశాల్లో టాప్ లో నిలవడం విశేషం.

 

ఎంపీల్లో ఎక్కువ ఆస్తుల ఉన్న జాబితాలో అయోధ్య రామిరెడ్డి రూ.2557కోట్ల విలువైన ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రూ. 396 కోట్ల విలువైన ఆస్తులతో పరిమల్‌ నత్వానీ నిలిచారు. మూడో స్థానంలో రూ. 379 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీ నుంచి ఎన్నికైన జ్యోతిరాధిత్య సింథియా ఉన్నారు. ఈ మేరకు రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఇక మిగిలిన ఇద్దరు ఎంపీల విషయానికి వస్తే.. వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఆస్తుల విలువ రూ.4 కోట్లు ఉండగా.. మరో సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆస్తుల విలువ కేవలం రూ. 32 లక్షలు మాత్రమే.

 

మరోవైపు ఆస్తులు మాత్రమే కాదు అప్పుల్లోనూ ఇద్దరు వైసీపీ ఎంపీలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అత్యధిక అప్పులు రూ. 209 కోట్లతో పరిమల్‌ నత్వానీ తొలి స్థానంలో ఉండగా.. రూ. 154 కోట్ల అప్పులతో అయోధ్యరామి రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. రూ. 10 కోట్ల అప్పులతో ఆర్జేడీ సభ్యుడు అమరేంద్ర ధారిసింగ్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి ఎన్నికైన నలుగురు వైసీపీ ఎంపీల్లో ఇద్దరిపై కేసులు ఉన్నాయి. అయోధ్యరామిరెడ్డిపై 10 కేసులు, మోపిదేవి వెంకటరమణపై రెండు కేసులు ఉన్నాయి. అలాగే కొత్తగా ఎంపికైన 62 మంది ఎంపీలలో 8 మంది మాత్రమే మహిళలున్నారు. అంతేలే.. రాజకీయమంటేనే డబ్బుతో కూడుకున్న పని.. ఆ మాత్రం లేకపోతే ఎలా.

మరింత సమాచారం తెలుసుకోండి: