ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి ధాటికి అగ్ర‌రాజ్యాలు కూడా అల్లాడి పోతున్నాయి. అయితే, క‌రోనా వైర‌స్‌ను మొద‌ట్లో అంత సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇది చిన్న‌ఫ్లూ వంటిదేన‌ని చెప్పిన అగ్ర‌రాజ్యాధీసులు సైతం.. త‌ర్వాత త‌ర్వాత చేతులు ఎత్తేశారు. అప్ప‌టి వ‌రకు క‌రోనాపై ఏవేవో చెప్పిన వారంతా..  `అస‌లు ఇది అంతు ప‌ట్ట‌డం లేదు`.. `దీని వ్య‌వ‌హారం అంతు చిక్క‌డం లేదు`-లేదంటూ.. త‌ల‌లు ప‌ట్టుకున్నారు. లాక్‌డౌన్‌ను కీల‌క ఆయుధంగా  పేర్కొన్నారు. దీంతో ప్ర‌పంచ‌మంతా త‌న‌కు తానుగా సంకెళ్లు బిగించుకుని మూతికి గుడ్డ‌క‌ట్టుకుంది!

ఇలా ఎన్నాళ్లు! రోజులు.. వారాలు.. నెల‌లు.. గ‌డిచాయి. క‌రోనా ఎక్క‌డా అదుపులోకి రాలేదు. లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లు అత‌లాకుత‌లం అయ్యాయి. ఉద్యోగాలు పోయాయి. ఉన్న ఉద్యోగాల‌కూ స‌గ‌మే జీతం ముట్టింది. ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయి. ఫ‌లితంగా ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోయి.. రోడ్డున ప‌డ్డారు. ఈ ప‌రిస్థితి ఎక్క‌డో జ‌రిగింది కాదు.. మ‌న దేశంలోనే జ‌రుగుతోంద‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించిన `ఎకో ర్యాప్` అనే సర్వేలో స్ప‌ష్ట‌మైంది. తాజాగా ఈ నివేదికలోని సారాంశం వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి.. కొవిడ్‌-19 ఎఫెక్ట్.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై భారీగానే పడింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో ఆర్థికంగా బ‌లంగా ఉన్న రాష్ట్రాల్లో క‌రోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉంద‌ని నివేదిక వెల్ల‌డించింది.

ఆర్థికంగా బ‌లంగా ఉన్న రాష్ట్రాలైన ఢిల్లీ, తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్ వంటి మొత్తం 8 రాష్ట్రాల్లో క‌రోనా బ‌ల‌మైన దెబ్బ‌వేసింద‌ని ఎస్‌బీఐ నివేదిక స్ప‌ష్టం చేసింది. ఫ‌లితంగా ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప‌టిష్టంగా అమ‌లు చేశారు. దీంతో ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌నులు ఆగిపోయాయి. ప‌రిశ్ర‌మ‌లు మూత బ‌డ్డాయి. ఫ‌లితంగా ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోయాయి. గ‌త అంటేఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్దిక సంవ‌త్స‌రానికి(2019-20), ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రానికి(2020-21) త‌ల‌స‌రి ఆదాయాలు భారీగా ప‌డిపోయా య‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. ఇది ఆయా రాష్ట్రాలే కాకుండా దేశ త‌ల‌స‌రి ఆదాయంపై కూడా ప్ర‌భావం చూపుతోంద‌ని నివేదిక వెల్ల‌డించింది.

క‌రోనా కార‌ణంగా ప‌నులు మూత‌బ‌డ‌డం, ఉద్యోగాలు కోల్పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో నిరుద్యోగిత పెరిగిపోయి.. ఆదాయాలు ప‌డిపోయాయ‌ని, ఇది గ‌త ఏడాది త‌ల‌స‌రి ఆదాయంలో 5.4% త‌గ్గుద‌ల ఉంటుంద‌ని ఎస్‌బీఐ నివేదిక వివ‌రించింది.  ఇది దేశ జీడీపీపైనా ప్ర‌భావం చూపుతుంద‌ని వెల్ల‌డించింది. అంటే.. మొత్తంగా గ‌త ఏడాది త‌ల‌స‌రి ఆదాయం.. రూ.1.52 ల‌క్ష‌లు ఉంటే.. ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో అది 1.43 ల‌క్ష‌ల‌కు త‌గ్గిపోతుంద‌ని వివ‌రించింది. ప్ర‌ధానంగా ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌, గుజ‌రాత్‌పై ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని నివేదిక వివ‌రించింది. దీంతో అల్పాదాయ రాష్ట్రాలు, అధికాదాయ రాష్ట్రాల మ‌ధ్య అంత‌రం కూడా త‌గ్గుతుంద‌ని, దీంతో అస‌మాన‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఏపీ, తెలంగాణ‌ల్లో ఇదీ ప‌రిస్థితి!

రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా క‌రోనా ఎఫెక్ట్ ఎంత‌? అనే విష‌యాన్ని కూడా ఎస్‌బీఐ త‌న ఎకో ర్యాప్ నివేదిక ‌లో స్ప‌ష్టం చేసింది. ఏపీ క‌న్నా ఆదాయంలో తెలంగాణ బాగా ముందుంది. అయితే, క‌రోనా ఎఫెక్ట్‌తో హైద ‌రాబాద్ స‌హా సినీ ప‌రిశ్ర‌మ వంటివి మూత‌బ‌డ‌డంతో ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయంపై ప్ర‌భావం ప‌డింది. ఫ‌లితంగా త‌ల‌స‌రి ఆదాయం గ‌త ఏడాది కంటే 10-12% త‌గ్గుద‌ల న‌మోద‌వుతుంద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల‌వ‌డంతో ప్ర‌జల త‌ల‌స‌రి  ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోయింద‌ని స్ప‌ష్టం చేసింది. ఇది 8.1% ఉంటుంద‌ని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: