ఏపీ నుంచి రాజ్యసభకు ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణ తరలిపోవడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో జగన్ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  అయితే ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయి అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. సీనియర్లు, జూనియర్లు అందరూ ఆ పదవుల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తూ.. అధినేత జగన్ ని కలుస్తూ.. తమ మీద దయ చూపమని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు.

 

అయితే సీఎం జగన్ జగన్ మాత్రం ఇప్పటికే ఆ పదవులు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‍, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్‍కుమార్‍ లతో భర్తీ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియారిటీ, సామాజికవర్గాల ప్రాతిపదికన వీరిద్దరినీ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి ఇప్పటికే ఎంపిక చేశారని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే ఎస్‍.అప్పలరాజు పేరు కూడా వినిపించినా ఆయన మొదటిసారి గెలిచినందున అవకాశం లేదని చెబుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత 80 శాతం మంత్రులను మారుస్తానని సీఎం గతంలోనే ప్రకటించారు.

 

ఇప్పుడు మంత్రి పదవి చేపట్టినా మరో ఏడాదిన్నర తర్వాత జరిగే మార్పుల్లో తమను తప్పించవచ్చన్న సందేహం తో మంత్రిపదవుల కోసం ఎవరు పోటీ పడటం లేదు. బోస్‍, మోపిదేవి వచ్చే నెల ఐదో తేదీలోగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఆలోపే వారిద్దరితో మంత్రి పదవులకు రాజీనామా చేయించడం, కొత్తగా ఇద్దరిని చేర్చుకోవడం చకచకా జరిగిపోతాయని పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు. అయితే అలాగే కేబినెట్ లో కొన్ని మార్పులు జరగవచ్చని, కొందరిని మంత్రి పదవుల నుంచి తొలగించే అవకాశం ఉందని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. కానీ, ఇవన్నీ పుకార్లు మాత్రమేనని, అలాంటి మార్పులు ఉండబోవని చెప్తున్నాయి వైసీపీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: