ప్రైవేటు ఆస్ప‌త్రులు క‌రోనా టెస్టుల పేరుతో నిలువు దోపిడీని మొద‌లు పెట్టాయి. కరోనా సాకుతో లెక్కలేనన్ని పరీక్షలు చేసి లెక్కకుమించి బిల్లు చేతిలో పెడుతుండ‌టంతో ప‌రీక్ష‌ల‌కు వెళ్లిన జ‌నాలు బిత్త‌రపోయి చూడాల్సి వ‌స్తోంది.ప్ర‌భుత్వం మొద‌టి నుంచి చెబుతున్న‌ది..భ‌య‌ప‌డుతున్న‌దే జ‌రుగుతోంది. క‌రోనా నిర్ధార‌ణ‌కు సంబంధం లేని ప‌రీక్ష‌లు చేస్తూ వేల‌ల్లో ఫీజులు వ‌సూలు చేస్తూ ప్రైవేటు ఆస్ప‌త్రులు రోగుల జేబును గుల్ల చేస్తున్నారు. టెస్టుల ఫీజులను పెంచకూడదని ఐఎంఏ ఆదేశాలు జారీ చేసినా ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కేస్తున్నాయి. హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంలోని ప‌లు ప్రైవేటు ఆస్పత్రుల్లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

 

దీంతో కాసులు దండుకోవ‌డానికి ఇంత‌కు మించిన మంచి అవ‌కాశం దొర‌క‌ద‌నుకుంటున్న ప్రైవేటు ఆస్ప‌త్రులు తమ నైజాన్ని చూపుతున్నాయి.కరోనా పేరుతో అవసరమున్నా, లేకున్నా ఇష్టారాజ్యంగా టెస్టులు చేస్తున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు కూడా వేల‌ల్లోనే ఫీజులను వ‌సూలు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.  ఇక ఈ ప‌రీక్ష‌ల పేరుతో దోపిడీ ముఖ్యంగా ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో మ‌రీ ఎక్కువ‌గా సాగుతున్న‌ట్లు జ‌నాలు వాపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా రాష్ట్ర ఉన్న‌తాధికారుల‌కు అందుతున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  అంతేకాక ప్రైవేటు ఆస్ప‌త్రులు  కరోనా ప్రోటెక్షన్ పేరుతో ఫీజులను పెంచి వ‌సూలు చేస్తున్నాయి.

 

 ఓపీ నుంచి సర్జరీ వరకు అన్ని ఫీజులను పెంచడంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్క్ లు ధరించి వైద్యం అందిస్తున్నామని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. ఈ మేరకు ఖర్చులు పెరిగాయని అందుకే ఫీజులు పెంచాల్సి వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ప్ర‌భుత్వం క‌రోనా ప‌రీక్ష‌ల‌కు ఆరోగ్య‌శ్రీని వ‌ర్తింప‌జేయాల‌నే డిమాండ్ ఇప్పుడు జ‌నాల నుంచి ఎక్కువ‌గా విన‌బ‌డుతోంది. ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు ప‌ర్మిష‌న్లు ఇచ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే ఆ విధానాన్ని అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలంగాణలోనూ ప్రారంభించాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: