ముఖ్యమంత్రయిన ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలపై సీరియస్ గా దృష్టిపెట్టాడు.  అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సంక్షేమపథకాల ప్రకటనలు, వాటి అమలుపైనే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.  అందుకనే కొందరు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు వాళ్ళిష్టం వచ్చినట్లు ఆటలాడారు. నరసాపురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు కు షోకాజ్ నోటీసు జారీ చేయటంతోనే జగన్ సీరియస్ నెస్ ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. ఇంతకాలం తామెలాగున్న జగన్ పట్టించుకోవటం లేదనే నిర్లక్ష్యంలో ఉన్నట్లున్నారు. కానీ హద్దు దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నట్లుగా ఏకంగా ఎంపికే షోకాజ్ నోటీసు జారీ చేయటంతో కొందరికి వార్నింగ్ ఇచ్చినట్లే అయ్యింది.

 

గెలిచిన దగ్గర నుండి రఘురాముడు సర్వ స్వత్రంత్రునిగా వ్యవహరిస్తున్న విషయం అందరు చూసిందే. ఎంపిలందరూ పార్టీలైన్ కు కట్టుబడే పనిచేస్తుంటే కృష్ణంరాజు మాత్రం తనకు పార్టీలైన్ వర్తించదన్నట్లుగా ఓవర్ యాక్షన్ చేశాడు. చివరకు జగన్ను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇంతకాలం ఎంపి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, అమలుపైన ఏమి మాట్లాడినా జగన్ ఓపిగ్గానే భరించాడు. ఎప్పుడైతే నేరుగా జగన్ తో పాటు మరికొందరు ఎంఎల్ఏలను డైరెక్టుగా ఎటాక్ చేశాడో అప్పుడో అందరికీ అనుమానం వచ్చేసింది. నేరుగా తననే చులకనగా మాట్లాడిన తర్వత కూడా ఎంపిపై యాక్షన్ తీసుకోకపోతే  పార్టీకి నష్టం జరుగుతుందని జగన్ డిసైడ్ అయినట్లున్నాడు.

 

ఎంపి వ్యవహర శైలిని గమనించిన వాళ్ళకు పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేడన్న విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే ఏదో ఓ అంశంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం, ప్రభుత్వాన్ని చులకన చేయటం కృష్ణంరాజుకు బాగా అలవాటైపోయింది. ఎల్లోమీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వటం, అదికూడా ప్రభుత్వంపై ఏవో కొన్ని ఆరోపణలు చేయటంతో చాలాసార్లు ప్రభుత్వం+పార్టీ సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  తనంతట తానుగా పార్టీకి దూరం కాకుండా పార్టీనే తనను దూరం పెట్టేట్లుగా వ్యవహరించాలని ఎంపి ఆలోచించినట్లుగా ప్రచారం జరుగుతోంది.  పార్టీయే తనను సస్పెండ్ చేసేట్లుగా నాయకత్వాన్ని కృష్ణంరాజు ప్రేరేపిస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది.

 

సరే కారణాలు ఏవైనా మనసులో ఏమున్నా మొత్తానికి వ్యవహారాలు కృష్ణంరాజు కోరుకుంటున్నట్లే జరుగుతున్నది. ఇందులో భాగంగానే గతంలో తాను చేసిన వ్యాఖ్యలపైన, ఆరోపణలపైన సమాధానం చెప్పుకోవాలంటూ ఎంపికి పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసిచ్చాడు. నోటీసుకు సమాధానం చెప్పేందుకు పదిరోజుల సమయం కూడా ఇచ్చింది పార్టీ.  సరే ఎంపి ఏమని సమాధానం ఇస్తాడు ? ఆ సమాధానంతో పార్టీ నాయకత్వం సంతృప్తి పడుతుందా ? లేదా ? అనేది వేరే సంగతి.

 

ఇక్కడే పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షోకాజ్ కు ఎంపి ఇచ్చే సమాధానాన్ని చూసిన తర్వాత మొదటి వార్నింగ్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారనేది ఒక వాదన. ఎటూ ఎంపికి పార్టీలో ఉండే ఉద్దేశ్యం లేదు కాబట్టి సస్పెండ్ చేసి బయటకు పంపేస్తారనేది రెండో వాదన.  ఎంపి వ్యవహారశైలంతా రెండో వాదనకు మద్దతుగానే ఉందని పార్టీ నేతల అనుమానాలు. అందుకనే ఎంపి ఎక్కువ రోజులు పార్టీలో ఉండలేడనే ప్రచారం ఊపందుకుంటోంది. ఎవరి వాదన ఎలాగున్నా మొన్నటి ఎన్నికల్లో కేవలం వైసిపి అభ్యర్ధిగా పోటి చేశాడు కాబట్టే కృష్ణంరాజు గెలిచాడన్నది నూరుశాతం వాస్తవం.  మరి వాస్తవాన్ని ఇప్పటికైనా ఎంపి గ్రహించి పార్టీ లైన్ కు కట్టుబడి ఉంటాడా ? లేకపోతే తనిష్టం వచ్చినట్లు వ్యవహరించి పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతాడా ? అన్నదే చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: