రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. ఇది ముమ్మాటికి అక్షర సత్యం. ఇవాళ ఒక పార్టీలో ఉంటే.. రేపు మరో పార్టీలో ఉంటారు. ఇవాళ ఒక నాయకుడ్ని తిడితే.. రేపు అదే నాయకుడికి దండ వేసి దండాలు పెడతారు.. ఇదే నేటి రాజకీయం. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి.

 

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అక్రమ ఆస్తుల ఆరోపణల మీద 16 నెలల జైలుకు వెళ్లారు. ఈ కేసును ప్రముఖ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ డీల్ చేశారు.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన దూకుడు చూసి జగన్ పని అయిపోయిందని అనుకున్నారు.. కానీ, జైలు నుంచి బైటకి వచ్చి ఎట్టకేలకు సీఎం కుర్చీని దక్కించుకున్నారు జగన్. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉందనుకోండి, అది వేరే విషయం. అయితే జేడీ లక్ష్మీనారయణ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నిజంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ అప్పట్లో పెద్ద సంచలనమనే చెప్పాలి.

 

మొదట జనసేనలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం బీజేపీపై ఆయన చూపు పడింది.. కాకపోతే జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉండటంతో వెనకడుగు వేశారు. టీడీపీ పరిస్థితి అసలే బాగాలేదు.. దీంతో ఇప్పుడు ఆయన చూపు వైసీపీపై పడినట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న కరోనాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యాలకు మద్దతు తెలిపిన జేడీ తాజాగా సీఎం జగన్ ఏడాది పాలనపై ప్రశంసలు కురిపించడం విశేషం. ఇవన్నీ ఆయన జగన్ కి దగ్గరయ్యేందుకే చేస్తున్నాడేమో అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

 

అయితే తనను జైలుకు పంపిన జేడీని జగన్ తన పార్టీలోకి ఆహ్వానిస్తాడా అనే అనుమానం ఇప్పుడు అందరిలో కలుగుతోంది. అయితే ఇప్పటికే జగన్ పై కేసులు రాజకీయ కక్షతో పెట్టారని.. విధి నిర్వహణలో భాగంగానే తాను ఆ కేసులను విచారణ జరిపానని జేడీ పరోక్షంగా ఒకసారి అన్నారు. దీంతో ఇప్పుడు జేడీ గనుక వైసీపీలోకి వస్తే సీఎం జగన్ కి క్లీన్ చిట్ దొరికినట్టే, అలాగే ప్రజల్లో ఆయనకు మరింత ఆదరణ లభిస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే జగన్ కూడా జేడీని పార్టీలో చేర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: