అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే అధికార వైసిపిలో గొడవలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. దాంతో పార్టీ పరువు కూడా బజారుకెక్కింది. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను కొందరు ప్రజా ప్రతినిధులు రోడ్డెక్కి అరుస్తుండటంతో ప్రభుత్వం పరువు కూడా కృష్ణానదిలో కలిసిపోతోంది. ఇందుకు జగన్మోహన్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని చెప్పాలి. ఎన్నికల ముందు జగన్ చేసిన తప్పులే ఇపుడు పార్టీతో పాటు ప్రభుత్వం పరువును రోడ్డున పడేస్తున్నాయి. ఇంతకీ జగన్ చేసిన తప్పేంటి ? ఏమిటంటే టిడిపిలో నుండి వచ్చిన కొందరిని నెత్తిన పెట్టుకుని టిక్కెట్లిచ్చి గెలిపించటమే.

 

అవును మీరు చదివింది అక్షరాల వాస్తవం. నరసాపురం  ఎంపి రఘురామ కృష్ణంరాజు విషయాన్నే తీసుకుంటే ఆయనకు టిడిపిలో టికెట్ ఖాయమైంది. అయినా తెలుగుదేశంపార్టీని కాదని చివరి నిముషంలో వైసిపిలో చేరి టికెట్ తెచ్చుకుని గెలిచాడు. అంతకుముందు పార్టీలోనే ఉండే రాజును వైసిపి సస్పెండ్ చేస్తే వెళ్ళి కమలంపార్టీలో చేరాడు. అక్కడ ఉండలేక చివరకు టిడిపిలో చేరి మళ్ళీ వైసిపిలో జాయిన్ అయ్యాడు. కొద్ది కాలంలోనే ఇన్ని పార్టీలు మారిన రాజుకు ఏ పార్టీకీ లాయల్ గా ఉండడని అర్ధమైపోతోంది. తన స్వప్రయోజనాలే తనకు ముఖ్యం. అందుకనే గెలిచిన దగ్గర నుండి పార్టీ లైనును ధిక్కరిస్తు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. చివరకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసునే ఛాలెంజ్ చేశాడు. రాజును పార్టీలోకి చేర్చుకోవటం, టికెట్ ఇవ్వటమే జగన్ చేసిన తప్పు.

 

అలాగే తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ విషయంలో కూడా ఇదే తప్పు చేశాడు జగన్. బల్లి కూడా చివరి నిముషంలోనే టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరి టికెట్ తెచ్చుకుని గెలిచాడు. గెలిచిన దగ్గర నుండి ఎంఎల్ఏలతో పడటం లేదు. ప్రతిచిన్న విషయాన్ని వివాదం చేస్తుంటాడనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పార్టీలో ఎవరితోను ఎంపికి సఖ్యత లేదని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. చివరకు శిలాఫలకాల్లో తన పేరు లేదని, ప్రారంభోత్సవాల్లో తనకు ఆహ్వానం లేదని కూడా గొడవలు జరుగుతున్నాయట. నిజానికి నరసాపురం, తిరుపతి నియోజకవర్గాల్లో పార్టీలో గట్టినేతలు లేరనేనా టిడిపి నుండి వచ్చిన వాళ్ళకు జగన్ టిక్కెట్లిచ్చింది.

 

నిజానికి టిడిపి నుండి వచ్చి టికెట్లు తీసుకుని పోటి చేసిన వాళ్ళ బదులు పార్టీలోని నేతలకే ఎవరికైనా టిక్కెట్లిచ్చుంటే ఇంకా మంచి మెజారిటితో గెలిచుండేవారనటంలో సందేహం లేదు.  వీళ్ళిద్దరికి లాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డిదీ ఇదే వరస. ఈయన కూడా చివరి నిముషంలో టిడిపిలో నుండే వైసిపిలోకి వచ్చి ఎంఎల్ఏ టికెట్ తీసుకుని గెలిచాడు. టిడిపిలో ఉండలేక, టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానంతోనే  ఆనం వైసిపిలో చేరాడు. ఎంఎల్ఏగా గెలిచిన దగ్గర నుండి మంత్రిపదవి కోసం ప్రయత్నాలు చేశాడు. ఆశించినది దక్కకపోయేసరికి చివరకు బహిరంగంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

 

ప్రభుత్వంలోను, పార్టీలోను లోపాలుంటే చెప్పాల్సిందే. కానీ దానికి మీడియా సమావేశాలు వేదిక కాదన్న విషయం వీళ్ళకు బాగా తెలుసు. తెలిసి కూడా తరచూ మీడియాతో మాట్లాడుతూ  ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారంటే కావాలనే చేస్తున్న విషయం తెలిసిపోతోంది. కాబట్టి పార్టీ పరువు తీస్తున్నారంటూ వాళ్ళని నిందించి ఏమీ ఉపయోగం లేదు.  వాళ్ళని పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చి గెలిపించిన జగన్ దే తప్పు. ఇప్పటికి బయటపడింది వీళ్ళు మాత్రమే. భవిష్యత్తులో ఇంకెంతమంది మీడియాకు ఎక్కుతారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: