ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే కొత్తగా ఎవరికీ పరిచయం అవసరం లేదు. రెండుసార్లు రాజమండ్రి ఎంపిగా, రాజకీయ విశ్లేషకుడిగా జనాల్లో మంచిపేరున్న వ్యక్తి. ఇలాంటి ఉండవల్లి కూడా మీడయా సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మొత్తం ఉండవల్లి ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాజీ ఎంపి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు అనుమానంగా ఉంది. లేకపోతే జగన్ పై బహిరంగంగా ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. తన మీడియా సమావేశంలో ఎన్నికల కమీషనర్ గా  నిమ్మగడ్డ తొలగింపును, హైకోర్టు తీర్పులపై సోషల్ మీడియాలో వచ్చిన నిరసనలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలే విచిత్రంగా ఉన్నాయి.

 

నిమ్మగడ్డను ప్రభుత్వం వేధిస్తోంది అనేట్లుగా ఉండవల్లి వ్యాఖ్యలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ వ్యవహారశైలి ఏకపక్షంగా ఉందని ఉండవల్లికి అనిపించలేదా ?  బిజెపి నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావుతో కలిసి రహస్యంగా ఓ హోటల్లో నిమ్మగడ్డ భేటి అవ్వటం ఉండవల్లికి తప్పుగా అనిపించలేదు. స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదే వేసేటపుడు ప్రభుత్వంతో మాట్లాడాలన్న కనీస మర్యాదను నిమ్మగడ్డ పాటించకపోవటం తప్పుగా అనిపించలేదేమో. ఈ వివాదంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఓ తప్పు చేశాడు. నిమ్మగడ్డ సామాజికవర్గాన్ని ప్రస్తావించటం తప్పే. అలాగే ఆర్గినెన్సుతో ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని తగ్గించటం కూడా నిబంధనలకు వ్యతిరేకమనే అంటున్నారు. ఈ విషయం కోర్టులో తేలుతుంది లేండి.

 

మద్యం ధరలు పెంచినంత మాత్రాన మందు తాగటం మానేస్తారా ? అనే ప్రశ్న వేశాడు ఉండవల్లి. నూరుశాతం తాగటం మానేస్తారని ఎవరూ అనటం లేదు. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నవారు మానేసే అవకాశం కనీసం తగ్గించే అవకాశం ఉంది కదా. చంద్రబాబునాయుడు హయాంలోని 43 వేల బెల్టుషాపులు మూసేయించటం, 40 శాతం బార్లు,  33 శాతం వైన్ షాపుల సంఖ్యను కుదించటం లాంటివి ఉండవల్లికి కనిపించకపపోవటమే విచిత్రంగా ఉంది.  పాపులర్ బ్రాండ్లను తగ్గించేయటం, కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి తేవటం కూడా ఇందులో భాగమే అన్న విషయం ఉండవల్లికి అర్ధం కావటం లేదా ?

 

ఇక రాజకీయంగా ప్రత్యర్ధులపై వేధింపులంటున్నాడు. ఎవరిని వేధించింది ప్రభుత్వం ? మాజీ మంత్రి  అచ్చెన్నాయుడు, మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి చేసిన అవినీతి, మోసాలు ఉండవల్లికి కనబడలేదా ?  చట్టప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకుంటుంటే కూడా వేధింపులను ఉండవల్లి ఎలా అంటున్నాడో అర్ధం కావటం లేదు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఉండవల్లి గమనించలేదేమో. ప్రతిరోజు వేలాదిమందికి వైరస్ నిర్ధారణ పరీక్షలను చేస్తోంది. ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం కూడా ఉండవల్లి దృష్టికి రాలేదేమో. వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో చాలా రాష్ట్రాలకన్నా ఏపి మెరుగైన చర్యలు తీసుకుంటోందని కేంద్రప్రభుత్వం చెప్పిన విషయం వినబడలేదేమో.

 

ఇక జడ్జీలను నరికేస్తారా ? అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వం తరపున న్యాయవ్యవస్ధపై ఒక్కమాట కూడా వ్యతిరేకంగా రాలేదు. వైసిపి అభిమానులు లేదా సోషల్ మీడియాలో నెటిజన్లు న్యాయవ్యవస్ధ నిష్పాక్షికతపై వ్యాఖ్యలు చేస్తే దాన్ని ప్రభుత్వానికి ఉండవల్లి ఎలా ఆపాదిస్తాడు ?  సంక్షేమపథకాలపై జగన్ దృష్టి పెట్టడాన్ని కూడా ఉండవల్లి తప్పు పట్టడమే విచిత్రంగా ఉంది. ఇపుడు అమలు చేస్తున్న పథకాలను జగన్ తన మ్యానిషెస్టోలనే ప్రకటించాడు. పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పాడు. అధికారంలోకి రాగానే  వాటిని అమలు చేస్తున్నాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నందుకు జగన్ను మాజీ ఎంపి అభినందించాల్సిందిపోయి తప్పు పట్టడమే ఆశ్చర్యంగా ఉంది.

 

అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని జగన్ కు సూచన చేయటంలో తప్పేమీ లేదు. కరోనా వైరస్ కారణంగా పరిశ్రమలు ఏర్పాటులో జాప్యం జరిగిందని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. బహుశా రెండు మూడు నెలల్లో కొన్ని పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు కావచ్చని అనుకుంటున్న విషయాన్ని ఉండవల్లి మరచిపోకూడదు. ఏదేమైనా ఉండవల్లి తాజా మీడియా సమావేశం చూసిన తర్వాత ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు అర్ధమైపోతోంది. మరి కారణం ఎవరో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: