తాజా రాజకీయపరిణామాల్లో అధికార వైసిపిలో ఆ నలుగురు ఎవరబ్బా ? అనే విషయంలో నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎంఎల్సీ హోదాలో మంత్రులుగా ఉన్న ఇద్దరు కీలక నేతలు తాజా ఎన్నికల్లో రాజ్య సభ ఎంపిలుగా ఎన్నికయ్యారు.  మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ను జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా తీసుకున్నారు.  రాజకీయ కారణాలతో  శాసనమండలి రద్దుకు ప్రభుత్వం సిఫారసు చేసిన నేపధ్యంలో ఈ రోజో రేపే మండలి రద్దవ్వక తప్పదు. కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైంది కానీ లేకపోతే ఈ పాటికి మండలి రద్దయ్యేదే.

 

సరే ఎలాగూ మండలి రద్దవుతోంది కాబట్టి  ముందుజాగ్రత్తగా బిసి సామాజిక వర్గానికి చెందిన పై ఇద్దరు మంత్రులను జగన్ రాజ్యసభకు ఎంపిక చేశాడు. అంటే పిల్లి, మోపిదేవి రాజ్యసభ ఎంపిలైన కారణంగా ఒకేసారి ఇటు మంత్రిపదవులు అటు ఎంఎల్సీ స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. మరి వీళ్ళద్దరి స్ధానంలో మంత్రివర్గంలో జగన్ ఎవరిని తీసుకుంటాడు ? ఎంఎల్సీలుగా ఎవరికి అవకాశం ఇస్తాడు ? అనేది పెద్ద సస్పెన్సుగా మారిపోయింది.  కౌన్సిల్ ఎప్పటికైనా రద్దయ్యేదే కాబట్టి ఖాళీ అయిన రెండు స్ధానాలను జగన్ భర్తీ చేయకుండా వదిలేస్తాడని పార్టీలో  చర్చ జరుగుతోంది.

 

అదే సమయంలో కౌన్సిల్ రద్దవ్వాలంటే అందుకు పార్లమెంటు ఆమోదం కావాలి. కరోనా వైరస్ నేపధ్యంలో పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో ఎవరూ చెప్పలేకున్నారు. ఎందుకంటే మార్చిలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాలనే వైరస్ కారణంగా ఆకస్మాత్తుగా రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. వర్చువల్ టెక్నాలజీలో సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ జరిగినా సాధ్యంకాక మళ్ళీ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.  కాబట్టి క్షేత్రస్ధాయిలో సమస్యను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పట్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపించటం లేదు.

 

ఈ నేపధ్యంలోనే పార్టీకి వచ్చే రెండు ఎంఎల్సీ స్ధానాలను జగన్ వదులుకునే అవకాశాలు లేవనే వాదన కూడా పార్టీలో వినిపిస్తున్నాయి.  కాబట్టి మంత్రిపదవులను భర్తీ చేస్తునే ఎంఎల్సీలుగా కూడా ఇద్దరిని ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఎంఎల్ఏల నుండే ఇద్దరిని  మంత్రులుగా తీసుకుంటే జగన్ కు ఓ సౌలభ్యం ఉంది. అదేమిటంటే తాను అనుకున్నంత కాలం వారిని మంత్రులుగ కంటిన్యు చేసే అవకాశం ఉంది. అదే కౌన్సిల్ నుండి ఇద్దరిని మంత్రులుగా చేస్తే మండలి రద్దు అయితే వాళ్ళ మంత్రి పదవులు కూడా పోతాయి.

 

కాబట్టి గతంలోనే తాను హామీ ఇచ్చినట్లుగా ఓ ఇద్దరిని ఎంఎల్సీలుగాను మరో ఇద్దరు ఎంఎల్ఏలను మంత్రులుగాను విడివిడిగానే జగన్ ఎంపిక చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు రాజ్యసభకు ఎంపికైన ఇద్దరు మంత్రులు బిసిలే. కాబట్టి వాళ్ళ స్ధానంలో మళ్ళీ బీసీలనే ఎంపిక చేస్తాడా ? లేకపోతే  తాను హామీ ఇచ్చినట్లుగా మర్రి రాజశేఖర్ లాంటి వాళ్ళను సాటిస్ఫై చేయటానికి ఎంతకాలం ఉంటే అంతకాలం ఎంఎల్సీలుగా చేస్తాడో చూడాల్సిందే.   మొత్తానికి  జగన్ ఈక్వేషన్ అర్ధంకాకపోవటంతో నేతల్లో టెన్షన్ మాత్రం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: