పీవీ న‌ర్సింహారావు  పేరు వింటే చాలు తెలుగువారికి గ‌ర్వంగా అనిపిస్తూ ఉంటుంది. దేశం ఎంతో క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు ఆయ‌న‌. చాలా త‌క్కువ మెజార్టీతో ప్ర‌భుత్వం ఉన్నా... ప్ర‌భుత్వం కూలిపోకుండా ఐదేళ్ల పాటు  గొప్ప పాల‌న‌ సాగించిన రాజ‌నీతిజ్ఞుడు. పీవీ ప్ర‌ధానిగా కొన‌సాగింది ఐదేళ్లే అయినా అనేక సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. భావి భార‌త ఆర్థిక నిర్మాణానికి పీవీ వేసిన పాదుల‌పైనే నేడు నిర్మాణాలు కొన‌సాగుతున్నాయ‌న‌డంలో అతిశేయోక్తి లేదు.  మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్‌ను  కేంద్ర ఆర్థిక మంత్రిగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. మ‌న్మోహ‌న్ నేతృత్వంలోనే పీవీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల అమ‌లుకు పూనుకున్నారు.


మూస ఆర్థిక విధానాల‌ను మూల‌కు ప‌డేలా చేసేశారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు బీజం వేస్తూ..ప్ర‌పంచీక‌ర‌ణ వైపు భార‌త్‌ను న‌డిపించారు. భార‌త‌దేశం వైపు పెట్టుబడుదారులు చూసేలా చేశారు. లైసెన్సింగ్ రాజ్ విధానాల‌కు పాత‌రేశారు. వ్యాపార లావాదేవీలు, పెట్టుబ‌డుల‌ను సుల‌భ‌త‌రం చేసే ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నారు. నేడు మ‌నంద‌రం అనుభ‌విస్తున్న ఎన్నో సౌఖ్యాల‌కు పీవీ సంస్క‌ర‌ణ‌లే కార‌ణ‌మ‌న‌డంలో సందేహం లేదు. పీవీ అనుకున్న దానికంటే...నాడు ఆర్థిక వేత్త‌లు ఊహించిన దానికంటే నేడు భార‌త్ ఆర్థికంగా ఎంతో బ‌లోపేత‌మైంద‌నే చెప్పాలి. ఐరోపా దేశాల పెట్టుబ‌డుల‌కు  కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది భార‌త్‌. నిజానికి పీవీ దేశానికి, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చాలా చేశారు. కానీ ఆయ‌న‌కు ద‌క్కాల్సిన గౌర‌వం ద‌క్క‌లేద‌ని  స‌న్నిహితంగా ఉన్న‌వారు చెబుతుంటారు.

 

బ‌హుభాషా కోవిదుడిగా..అపార చాణ‌క్యుడిగా...రాజ‌నీతిజ్ఞుడిగా..మౌన‌మునిగా..గొప్ప సాహితీ వేత్త‌గా..మంచి ప‌రిపాల‌కుడిగా పీవీ ప్ర‌సిద్ధి పొందారు. స్వ‌తంత్ర భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ప్ర‌ధానిపీఠాన్ని అధిష్టించినా ఏకైక తెలుగు బిడ్డ పీవీ. దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన పీవీ జీవిత చ‌ర‌మాంకంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ చివ‌రికి ఆస్తుల‌ను సైతం అమ్ముకోవాల్సి రావ‌డం బాధాక‌రం. ఆయ‌న ద‌హ‌న సంస్క‌రాల‌ను కూడా యూపీఏ స‌ర్కారు అగౌర‌వ ప‌రుస్తూ  సాగించింది. ఈ దేశానికి ఎంతో చేసిన బిడ్డ‌..క‌డ‌సారి వీడ్కోలుపై కూడా రాజ‌కీయ క్రీడ కొన‌సాగ‌డం నిజంగా బాధాక‌రం. అయితే పీవీ సేవ‌ల‌ను నేటి త‌రానికి తెలియ‌ప‌ర్చేలా తెలంగాణ ప్ర‌భుత్వం నేటి నుంచి ఆయ‌న శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయ‌డం నిజంగా అభినంద‌నీయం. పీవీ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. ఆయ‌న జూన్ 28, 1921లో  జ‌న్మించారు. డిసెంబర్ 23, 2004లో ప‌ర‌మ‌ప‌దించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: