రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా చిత్రంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు.. చిత్రాలే జ‌రిగితే.. మ‌రింత విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి చిత్ర‌, విచిత్ర‌మైన విష‌యంపైనే వైసీపీ నాయ‌కులు  రాష్ట్రంలో ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు కూడా చెవిలో చిన్న‌మాట‌.. అంటూ.. పెద్ద‌గానే చెప్పుకొంటున్నారు. త‌మకు అత్యంత స‌న్ని హితంగా ఉన్న వారికి ఫోన్లు చేసి.. స‌ద‌రు విష‌యంపై మాట్లాడేస్తున్నారు. ``చిన్న‌గా చెప్పు.. ఎవ‌రైనా విం టారు!``-అంటూ..  కీల‌క‌మైన మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై పెద్ద‌గానే మాట్లాడుకుంటు న్నారు. కీల‌క నేత‌లు సైతం.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే.. వారికి సైతం ఈ విష‌యంలో సందేహాలు రావ‌డం.. వారు `త‌మ` అనుకున్న‌వారికి ఫోన్లు చేయ‌డం.. గంట‌ల త‌ర‌బ‌డి చెవులు చిల్లులు ప‌డేలా మాట్లాడుకోవ‌డం.. అధికార పార్టీలో తాజా అప్‌డేట్ అంటున్నారు ప‌రిశీల‌కులు. 

 

స‌రే! ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రంలో క‌రోనా ఎఫెక్ట్ పెరిగింది. మార్చిలో తొలి కేసు నెల్లూరు జిల్లాలో న‌మోదైంది. అది కూడా ఎవ‌రో విదేశాల నుంచి వ‌చ్చిన వార‌ని అధికారులు తెలిపారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే స్థానిక ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డం, ర‌గ‌డ‌గా మార‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత స్వ‌యంగా జ‌గ‌నే క‌రోనాపై ప్రెస్‌మీట్లు పెట్ట‌డం, ఇది చిన్న జ్వ‌ర‌మేన‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న చెప్ప‌డం, పారా సిట్మాల్ టాబ్లెట్ వేసుకున్నా.. బ్లీచింగ్ పౌడ‌ర్ చ‌ల్లుకున్నా చాల‌ని చెప్ప‌డం అంతా కూడా జ‌రిగిపోయింది. 
ఇక‌, ఆ త‌ర్వాత రాష్ట్రంలో క‌రోనా టెస్టులు ఏప్రిల్ చివ‌రి వారంలో ప్రారంభమ‌య్యాయి. కొన్ని ల్యాబులు ఏర్పాటు చేసి స్వాబ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మే నెల‌లో పూర్తిగా ఇంటింటికీ స‌ర్వే చేశారు. 


అంటే.. దీనిని బ‌ట్టి.. రాష్ట్రంలో ప్ర‌భుత్వం క‌రోనాపై దృస్టి పెట్టింది మార్చి చివ‌రి వారం నుంచి అంతేక‌దా ! ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వంలోని కీల‌క పెద్ద‌లు, అధికార‌, ప్ర‌తిప‌క్షాలు సైతం అంద‌రూ కూడా ఇదే అనుకుంటున్నారు. నిజానికి కేంద్ర ప్ర‌భుత్వం కూడా అప్ప‌ట్లోనే చ‌ర్య‌లు ప్రారంభించి మార్చి 20 త‌ర్వాతే దేశంలో లాక్‌డౌన్‌ను విధించారు. ఇదీ సంగ‌తి! అయితే.. తాజాగా ఏం జ‌రిగిందంటే.. వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి క‌రోనా ప‌రీక్ష‌లు-ప్ర‌భుత్వ విధానంపై `ది ప్రింట్‌` -అనే మీడియా సంస్థ‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవే ఇప్పుడు ప్ర‌తిప‌క్షం మాట అటుంచితే.. వైసీపీ నేత‌ల‌మ‌ధ్యే చ‌ర్చ‌కు వ‌చ్చాయి. 


ఇంత‌కీ మంత్రి గౌత‌మ్‌రెడ్డి ఏమ‌న్నారంటే.. ``సీఎం జ‌గ‌న్‌కు క‌రోనాపై డిసెంబ‌రులోనే తెలుసు. ఆయ‌న అప్ప‌టి నుంచే అప్రమ‌త్త‌మ‌య్యారు. అప్ప‌ట్లోనే అధికారుల‌ను ఆదేశించారు. అప్ప‌ట్లోనే అన్ని ఆసుప త్రుల‌ను రెడీ చేయాల‌ని అన్నారు. ఇంత ముందుగానే స్పందించిన సీఎం దేశంలో జ‌గ‌న్ ఒక్క‌రే. ఆయ‌న దూర దృష్టి కార‌ణంగానే.. మ‌న రాష్ట్రంలో క‌రోనా కేసులు స‌హా మ‌ర‌ణాలు కూడా త‌క్కువ‌గా ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ దూర‌దృష్టిని ప్ర‌పంచం మొత్తం మెచ్చుకుంటోంది``. అని మంత్రిగారు కొనియాడారు. ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ కావ‌డం, ప్రధాన మీడియాలోనూ రావ‌డంతో.. వైసీపీ నేత‌లు ఒక్క‌సారిగా ఖంగుతిన్నారు. పైకి ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌క పోయినా.. లోలోన మాత్రం.. `మంత్రిగారు చెప్పిందాంట్లో నిజ‌మెంత‌? ` అని చ‌ర్చించుకుంటున్నారు. 


``వాస్త‌వానికి దేశం అలెర్ట్ అయిందే.. మార్చిలో! పోనీ.. కేంద్ర ప్ర‌భుత్వానికి తెలిసింది .. జ‌న‌వ‌రి రెండో వారంలో.. అప్ప‌ట్లో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ దేశంలో ప‌ర్య‌టిస్తున్నాడు కాబ‌ట్టి.. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌లేద‌ని అనుకున్నా.. ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు దేశంలో ఈ విష‌యంపై పెద్ద‌గా ప్ర‌స్థావ‌న లేదు. కానీ, మంత్రి గారు మాత్రం.. మన సీఎం జ‌గ‌న్‌కి మాత్రం డిసెంబ‌రులోనే ఎలా తెలిసింద‌బ్బా!  ఒక‌వేళ తెలిసింది పో..! ఆయ‌న అప్ప‌ట్లోనే అలెర్ట‌య్యారా?.. అలెర్ట‌య్యారు పో.. ! అప్ప‌ట్లోనే డాక్ట‌ర్ల‌ను సిద్ధం చేశారా?  సిద్ధం చేశారు పో..!  టెస్టులు కూడా అప్ప‌ట్లోనే మొద‌లెట్టారా?  .. మొద‌లు పెట్టారు పో..!  మ‌రి ఇన్ని కేసులు ఎందుకు న‌మోదైన‌ట్టు!?  నూటాయాభై మందికి పైగా ఎందుకు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు?!.. కొంచెం చెప్ప‌న్నా?!!``- ఇదీ ఇప్పుడు వైసీపీలో నేత‌ల మ‌ధ్య సాగుతున్న ఫోన్ సంభాష‌ణ‌.. చెవిలో చిన్న‌గా!! దీనికి ఎవ‌రికైనా స‌మాధానం తెలుసా?  చూద్దాం.. ఎవ‌రు నోరు విప్పుతారో!!

మరింత సమాచారం తెలుసుకోండి: