వైఎస్ఆర్ సీపీ అధినేత ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిపై ఇప్పుడు పార్టీలోనే కాక, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 151 సీట్లు,22 మంది ఎంపీల బలం ఉన్నా, జగన్ ఏపీ రాజకీయాల్లో అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. అధికారం చేపట్టిన దగ్గర నుంచి గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. తనకు ప్రజాసంక్షేమమే తప్ప ఇతర ఏ విషయాలు అవసరం లేదు అన్నట్లుగా జగన్ ముందుకు వెళ్తున్నారు. తాను ఈ స్థాయికి తీసుకు వచ్చిన పార్టీని, పార్టీ నాయకులను కాస్త దూరం పెట్టినట్టు గానే వ్యవహరిస్తూ మొత్తం పరిపాలన అంతా అధికారుల చేతుల్లో పెట్టేసాడు. ఎక్కడా, ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా గ్రామ వాలంటీర్ల ద్వారా అన్ని కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. ఈ వ్యవహారంపై ఎప్పటి నుంచో పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తి ఉంది. 

 


ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు వైసీపీ ఎంపీలు జగన్ పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. బిజెపి కి చెందిన ఒక కీలక నాయకుడితో మంతనాలు జరిపినట్టుగా కూడా వార్తలు రావడం, ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, అప్పటి అధికార పార్టీ టిడిపిలో చేరిపోయారు. అలాగే కర్నూలు నుంచి ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక, నంద్యాల నుంచి గెలిచిన ఎస్పీవై రెడ్డి, అరకు నుంచి కొత్తపల్లి గీత వంటి వారు జగన్ కు దూరమయ్యారు. అప్పుడంటే వైసిపి ప్రతిపక్షంలో ఉండటం, సాధారణంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

 


కానీ ఇప్పుడు వైసిపి పూర్తిగా మెజారిటీతో ఉంది. పార్లమెంట్ lo నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉంది. అలాగే రాజ్యసభలో ఆరో అతి పెద్ద పార్టీగా ఉంది. ఎంత బలంగా ఉన్నా ఇప్పుడు నాయకులు పక్క చూపులు చూస్తున్నారు అనే వార్తలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ముందుగా రఘురామకృష్ణరాజు వంటివారు వైసీపీపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, విమర్శలు చేశారు. ఆయనకు ఇప్పటికే పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసి సమాధానం చెప్పాలని కోరింది. ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇదిలా ఉండగా కొంతమంది వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తో రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు ఇప్పుడు వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. 

 


అసలు వైసీపీలో ఇంతగా నాయకుల అసంతృప్తులు పెరగడానికి, వలస బాట పట్టేందుకు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ పార్టీ కార్యక్రమాల విషయంలో తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ వస్తుండడం, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉండడం, కేవలం కొంతమంది కీలక నాయకులు మాత్రమే టచ్ లో ఉండటం వంటి పరిణామాలన్నీ ఎంపీలు ఎమ్మెల్యేలు అసంతృప్తిని రాజేస్తున్నాయి. ఇప్పుడు పార్టీ గీత దాటిన వారందరిని సస్పెండ్ చేసుకుంటూ వెళితే చాలా పెద్ద లిస్ట్ తయారవుతుంది. 

IHG


అలా కాకుండా, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది. పార్టీ పరంగా తాము ఎక్కడ ఎవరికి లోటు చేస్తున్నాము వంటి విషయాలు జగన్ బీరీజు వేసుకోవాల్సిన సమయం వచ్చింది. రఘురామకృష్ణంరాజు జగన్ పై అనేక ఆరోపణలు చేసిన తర్వాత, జగన్ ఇప్పుడు రోజుకు 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తులను గుర్తించే పనిలో జగన్ ఉన్నారు. ప్రభుత్వంతో పాటు, పార్టీని కూడా అంతే స్థాయిలో పటిష్టం చేసి ముందుకు తీసుకు వెళ్లకపోతే వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాగే పార్టీలో ఉన్న రాజకీయ సీనియర్ల సలహాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: