పోగొట్టుకున్నదాన్ని ఎలాగైనా సరే తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తుంటారు చాలా మంది. ఒకవేల అది కుదరకపోతే పోగొట్టుకున్న దాని స్థానంలోకి కొత్త దాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు అచ్చం అలాంటి పనే చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ. అసలు ఆ పార్టీ పోగొట్టుకున్నది ఏంటి..? దాని స్థానంలోకి రాబోతున్నది ఏంటి..? అసలు వైసీపీ వ్యూహం ఏంటి..? ఒకసారి చూద్దాం..

 

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొన్ని రోజులుగా పార్టీకి.. పార్టీ నిర్ణయాలకు.. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. అలాగే తనకు ప్రాణహాని ఉందంటూ జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా, ఈ నోటీస్ పై రఘురామకృష్ణంరాజు కూడా అంతే ధీటుగా బదులిచ్చి మ‌రింత వ్య‌తిరేకం అయ్యారు. తనకొచ్చిన షోకాజ్ నోటీస్ పై ఉన్న పార్టీ పేరు న్యాయబద్దకం కాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, అలాగే కొందరు బీజేపీ కేంద్ర పెద్దలని కలిసి వైసీపీకి మరింత షాక్ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. ఇదంతా అందరికీ తెలిసిందే.

 

రఘురామకృష్ణంరాజు చేసిన చర్యలతో పార్టీకి డ్యామేజీ జరిగింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. దీన్ని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఆ డ్యామేజీ పూడ్చే పనిని కొందరు సీనియర్ నాయకులకు అప్పగించినట్టు సమాచారం. దీంతో రంగంలోకి ఆ నాయకులు.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పేరుని తెరపైకి తెచ్చి మీడియా అటెన్షన్నీ, ప్రజల దృష్టినీ పక్కకు మళ్లించేలా వ్యూహాత్మకంగా పథకాన్ని రచించారు. చాలాకాలంగా రాపాక వరప్రసాద్‌, జనసేనకు దూరంగా వున్నారు. అలాగే సీఎం జగన్ మీద ఈ మధ్య ప్రేమ కనబరుస్తున్నారు.

 

దీన్ని గ్రహించిన వైసీపీ పెద్దలు.. రాపాకని ముందుకు తెచ్చి జనసేనపై ఆయనతో విమర్శలు చేయించడం ద్వారా పొలిటికల్‌ గలాటాకి దారి తీసినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ నిర్మాణమే జరగలేదు.. పార్టీలో నాకు తగిన గౌరవం దక్కలేదు.. పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడే అవకాశమే ఇవ్వరు.. ఆ అవకాశం ఎవరికీ వుండదు.. అంటూ రాపాక, మీడియా ముందుకొచ్చి జనసేన మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దీంతో జనసేన సైనికులు కూడా సోషల్ మీడియా వేధికాగా రాపాకకి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే దీని ద్వారా వైసీపీకి ఒరిగేదేమీ లేదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం వైసీపీ పెద్దల వ్యూహం ఆ పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: