నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు అంటూ ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళంతా భయంగా పాటలు పాడుకుంటూ గడుపుతున్నారట. గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు అన్నిటినీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వెలుగులోకి తీసుకువస్తూ, అవినీతిలో భాగస్వామ్యం అయిన నాయకులందరినీ అరెస్టు చేయించి ఊచలు లెక్కపెట్టిస్తుండడంతో పాటు అవినీతికి సంబంధించిన ఆధారాలు అన్నీ బయటపెడుతూ వస్తుండడం పరిణామాలన్నీ ఇప్పుడు టిడిపి నాయకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వారంతా ఇప్పుడు భయాందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.

IHG


 ఇప్పటికే టిడిపి నాయకుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం లో అరెస్ట్ అయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యే  వివాదాస్పద నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను జాతీయరహదారిపై ఆందోళన, లాక్ డౌన్ ఉల్లంఘన కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన  మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అక్రమంగా వాహనాల అమ్మకం కేసులో అరెస్టు చేశారు. ఆయన కుమారుడు అస్మిత రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. ఇంకా నియోజకవర్గ స్థాయి నేతలు చాలామంది అనేక అవినీతి కేసుల్లో ఇప్పటికే అరెస్టయ్యారు.

IHG


 కాగా ఇంకా టిడిపి కీలక నాయకులు ఎవరి జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. కొద్ది రోజుల క్రితమే టిడిపి మాజీమంత్రి, ఉత్తరాంధ్ర జిల్లా నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు నమోదైంది. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అయ్యన్న అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంకా చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడు, టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు, మాజీ హోం మంత్రి చిన రాజప్ప, కర్నూలు జిల్లా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులపైన, అనేక కేసులు నమోదయ్యాయి. 

 

వీరితో పాటు టిడిపి ప్రభుత్వంలో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, మాజీ మున్సిపల్, మాజీ మంత్రి, నారాయణ పితాని సత్యనారాయణ వంటి వారి పేర్లు ఇప్పుడు ఆ జాబితాలో ఉన్నట్టుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. వీరే కాకుండా ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చుట్టూ ఏపీ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లుగా సాక్ష్యాధారాలు కూడా సేకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


ముందుగా టిడిపి వెన్నుదన్నుగా నిలుస్తున్న నాయకులను అరెస్టు చేసి, ఆ తర్వాత లోకేష్ ను టార్గెట్ చేయాలన్నదే వైసీపీ లక్ష్యం గా కనిపిస్తోంది. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ కేడర్ లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఆందోళన చేపట్టి, అనవసరంగా టార్గెట్ అవ్వడంతో పాటు,  అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఎవరికి వారు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకవైపు పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చి పరుగులు పెట్టించాలని చంద్రబాబు చూస్తుంటే, ఇలా ఒక్కో నేత జైలు పాలవుతున్న తీరు ఆ పార్టీ నేతలకు మింగుడు పడడంలేదు.


 ముందు ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తుండడంతో, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు వైసీపీ లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. లేకపోతే అనవసర కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఏడు పదుల వయసులో చంద్రబాబు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే, ఇప్పుడు నాయకులు అధికార పార్టీ చర్యలతో భయాందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: