పెట్రో  ఆందోళ‌న‌ల‌ను కాంగ్రెస్‌పార్టీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటోంది. గ‌డిచిన ఐదు రోజులుగా జ‌రుగుతున్న‌ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. జాతీయ స్థాయిలో సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఇత‌ర ముఖ్య‌నేత‌ల‌ను ఎన్డీఏను ఇర‌కాటంలో పెట్టేందుకు ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్నారు. క‌రోనా కాలంలో సుంకాల పేరుతో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం దోపిడీ చేయ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. ప్ర‌ధాని మోదీ పాల‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ దునుమాడుతున్నారు. వాస్త‌వం చెప్పాలంటే క‌రోనా త‌ప్పా..ఏ వాయిస్ వినిపించ‌కుండా పోయినా కాంగ్రెస్‌కు ఇది ఒక అవ‌కాశంగా మారింది.

 

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది.  పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.38 చేరగా.. డీజిల్ రూ. 80.40కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 87.16కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.72కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.07 ఉండగా.. డీజిల్ రూ.75.56 ఉంది.  క‌రోనా దెబ్బ‌కు ఉద్యోగా, ఉపాధి అవ‌కాశాలు దెబ్బ‌తిని, కొలువుల‌కు, జీతాల‌కు కోత ప‌డి...ఖ‌ర్చులు త‌డిసి మోప‌డైన క‌రోనా కాలంలో పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై ప్ర‌జానీకంలో నిర‌స‌న జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ బ్యారెల్ ధ‌ర గ‌ణ‌నీయంగా ప‌డిపోయినా..భార‌త్లో మాత్రం లీట‌ర్ పెట్రోల్ 80కి చేరుకోవ‌డంపై ప్ర‌జానీకం భ‌గ్గుమంటోంది.

 

 ప్ర‌జా నిర‌స‌న స్వ‌రంలో న్యాయ‌ముండ‌టంతో కాంగ్రెస్ వారి ప‌క్షాన నిల‌బ‌డి పోరాటానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పెట్రోల్ ధ‌ర‌ల పెంపుతో తాము ఎక్కువ‌గా న‌ష్ట‌పోతున్నామ‌ని లారీ అసోసియేష‌న్ నాయ‌కులు చెబుతున్నారు.   పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని స్థానిక లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వివిధ రూపాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు ఆందోళ‌న‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పీసీసీల ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం నిరాహార దీక్ష‌లు కొన‌సాగాయి. త్వ‌ర‌లోనే పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి కాంగ్రెస్‌కు పెట్రోల్ అంశం బ‌లంగా మారేంత వ‌ర‌కు ఏన్డీఏ వెయిట్ చేస్తుందా..?  లేక వెంట‌నే త‌గ్గింపు చ‌ర్య‌లకు పూనుకుంటుందా అన్న‌ది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: