వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని చూస్తుంటే.. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట... అనే పాట బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లతో కలిసి రహస్య మంతనాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ విడుదల చేసిన వీడియోలతో తమ పార్టీకి లాభం చేకూరుతుందని భావించారు.. కానీ, చివరికి దానివల్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

 

వీడియో బయటకి రాగానే.. దానిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. కమ్మ కులస్తులు అందరూ కలిసి కమ్మగా మాట్లాడుకుంటున్నారు.. కానీ, దీనివెనుక దాగున్న అసలైన బిగ్ బాస్ గురించి త్వరలోనే మరో వీడియో బయట పెడతా అని చెప్పారు. విజయసాయి ఆ బిగ్ బాస్ పేరు చెప్పకపోయినప్పటికి.. ఆయన మాట్లాడింది చంద్రబాబు గురించే అని అందరికీ అర్ధం అయిపోయింది. కానీ, ఈ ప్రయత్నం బెడిసి కొట్టినట్టు సమాచారం.. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఆత్మరక్షణలో పడింది.

 

అలాగే సుజనా చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాస్ లతో  రమేష్ కుమార్ హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్ లో రహస్యంగా కలిసినట్లు వీడియో పుటేజీని సంపాదించి దాదాపుగా అన్ని టీవీ ఛానెళ్లలో వచ్చే విధంగా వైసీపీ ప్లాన్ చేసినట్లు రాజకీయవర్గాల్లో టాక్. ఒకేసారి అన్ని ఛానెళ్లలో ఒకే వార్త రావడంతో అందరూ నమ్ముతారని ఆ పార్టీ నాయకులు భావించారు. అయితే ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ తక్షణమే రమేష్ కుమార్ కు మద్దతుగా మాట్లాడినా ఆ పార్టీ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే.. అందరూ బీజేపీ వైపే చూడటం, బీజేపీ నిశ్శబ్దంగా ఉండటంతో పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

 

కానీ ఒక రోజు మొత్తం సైలెంటుగా ఉన్న బీజేపీ తరువాతి రోజు నుంచి ఎదురుదాడికి దిగింది. ముగ్గురు కలయికలో తప్పేం లేదని తేల్చి చెప్పింది. దాంతో బీజేపీపై నేరుగా మాటల యుద్ధం చేయలేని స్థితిలో ఉన్న వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. అదే విధంగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులను ఎలా కలుస్తారని వైసీపీ అధికార ప్రతినిధి ప్రశ్నించడం కూడా ఆ తర్వాత వివాదం అయింది. రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా అంగీకరిస్తున్నారా? అయితే తదుపరి చర్యలు తీసుకోండి అంటూ ప్రతిపక్షాలు దూకుడు ప్రదర్శించడంతో ఆ అంశంలో కూడా వైసీపీ తన వాదనను సమర్ధించుకోలేకపోయింది. పైగా సుజనా చౌదరిని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే హోటల్ లో కలిశారనే ప్రచారం జరగడం కూడా వైసీపీ సైలెన్సుకు కారణం అయింది. మొత్తం మీద ఈ అంశంపై విజయసాయి రెడ్డి ఒకటి ఊహిస్తే.. ఆయనకు ఊహించని షాక్ కొట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ.

మరింత సమాచారం తెలుసుకోండి: