భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపధ్యంలో  కేంద్రప్రభుత్వం డ్రాగన్ దేశానికి సంబంధించిన 59 యాప్ లను నిషేధించటం సంచలనంగా మారింది. మామూలుగా ఒక దేశానికి సంబంధించిన యాప్ లను మరో దేశం నిషేధించటం జరగదు. కానీ ప్రస్తుత పరిస్దితుల నేపధ్యంలో చైనా యాప్ ల నిషేధం తప్పనిసరి కావటంతో నిషేధించక తప్పలేదు. నిజానికి మనదేశంలో  యాప్ లే కాదు ఇతరత్రా రంగాల్లో కూడా చైనా ఉత్పత్తులే మార్కెట్ ను ముంచెత్తేస్తోంది. అయితే గడచిన రెండు నెలలుగా మనదేశంలోకి చైనా చొరబాట్లను, మన సైనికులపై డ్రాగన్ సైనికులు దాడులు జరిపి 20 మంది సైనికులను చంపేయటంతో చైనా వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

చైనాపై దేశజనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత కారణంగానే ముందుగా యాప్ లను నిషేధించాలని డిసైడ్ చేసింది కేంద్రం. మనదేశంలో వాడుతున్న చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్లు పెరిగిపోతున్నా ఇప్పటికప్పుడు సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.  అందుకనే ఎవరికీ నష్టం కలిగించని, చైనాకు మాత్రం భారీ నష్టం కలిగించే యాప్ లపై మొదటగా  నిషేధం వేటు పడింది. మనదేశంలో నిషేధించిన 59 చైనా యాప్ ల్లో బాగా పాపులరైన టిక్-టాక్, క్యాం స్కానర్, యూజీ బ్రౌజర్ ఉన్నాయని మార్కెట్ నిపుణుల విశ్లేషణ.

 

డ్రాగన్ యాప్ ల్లో టిక్-టాక్ యాప్ మనదేశంలో బాగా పాపులరైంది. ప్రపంచ మార్కెట్లో మనదేశంలోనే సుమారు 30 శాతం మార్కెట్ ఉంది. దీనివల్ల చైనా కంపెనీకి వచ్చే మొత్తం ఆదాయంలో 10 శాతం ఆదాయం మనదేశం నుండే అందుకుంటోంది. అంటే ప్రతి 100 రూపాయల ఆదాయంలో చైనా కంపెనీ 10 రూపాయలు మనదేశం నుండే సంపాదించుకుంటోంది. అందుకనే టిక్-టాక్ బ్యాన్ వల్ల తక్షణ ఆదాయం పడిపోతుంది. చైనా కంపెనీకి ఆదాయం పడిపోయిందంటే దాని ప్రభావం డ్రాగన్ ప్రభుత్వంపైన ఆటోమేటిక్ గా ప్రభావం పడుతుంది.

 

అలాగే యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్ లాంటి మరికొన్ని యాప్ లు కూడా చైనా కంపెనీలకు ఆదాయాలను సంపాదించిపెడుతున్నాయి. ఈ కంపెనీల ద్వారా చైనా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఇపుడు మనదేశం ఒక్కసారిగా 59 యాప్ లపై నిషేధం విధించగానే వీటిపైనా చైనా కంపెనీలు అందుకుంటున్న ఆదాయాలు పడిపోతాయి. దాని ద్వారా చైనా ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుందనటంలో సందేహం లేదు. భారత్ లో చైనా యాప్ లను బ్యాన్ చేయటంతో ఇదే పద్దతిలో ఇతర దేశాలు కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

నిజంగానే డ్రాగన్ యాప్ లను మనదేశంలో నిషేధించినట్లే ఇతర దేశాల్లో కూడా బ్యాన్ చేస్తే అప్పుడు చైనా ఆర్ధిక పరిస్ధితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే సమయంలో చైనా యాప్ లే కాదు మనదేశంలో వాడుతున్న టివిలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు తదితరాల విడిభాగాలు కూడా చైనా నుండే దిగుమతవుతున్నాయి. వీటిస్ధానంలో  కొరియా, వియత్నాం, జపాన్ తదితర దేశాలకు చెందిన విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో వాటికి ప్రత్యామ్నాయంగా మనదేశంలోనే కొన్ని విడిభాగాల తయారీ మొదలైందని కాన్షడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ (సీఏఎంటి) ప్రకటించటం ఎంతైనా హర్షణీయమే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: