తెలుగుదేశం పార్టీని వీడుతున్నది నాయకులు మాత్రమే.. కార్యకర్తలు కాదు. టీడీపీకి అసలైన బలం కార్యకర్తలే. నాయకులు పార్టీని వీడిన ప్రతీసారి టీడీపీ అధిష్టానం చెప్పే మాట ఇది. అందుకే అలాంటి కార్యకర్తలను కాపాడుకునేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అధికార పక్షాన్ని ధైర్యంగా ఎదుర్కునేందుకు తమ పార్టీ కార్యకర్తలకు సరికొత్త బలాన్ని ఇవ్వబోతున్నారు చంద్రబాబు.

 

2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. టీడీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగిపోయాయని టీడీపీ ఆరోపిస్తుంది. వాస్తవానికి అధికారంలో ఎవరుంటే వారిదే పై చేయి.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలకు కూడా ఇలాంటి పరిస్తితులే ఎదురయ్యాయి... ఆ విషయం పక్కన పెడితే. మీడియా ముందు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుంటే.. కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా అంతకు మించి రెచ్చిపోతున్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ హద్దులు మీరిపోతున్నారు. నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తూ.. వారిని కించపరుస్తూ.. వారి పరువుకు భంగం కలిగిస్తున్నారు.

 

అయితే ఇలాంటివి సహించేది లేదంటున్న సర్కార్‌.. సామాజిక మాధ్యమాల్లోని పోస్ట్‌ లపై కఠినంగానే వ్యవహరిస్తోంది. దీంతో కేసులు నమోదై.. అరెస్ట్‌ ల దాకా వెళ్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంలో టీడీపీ కార్యకర్తల మీదనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో క్యాడర్‌ ను కాపాడుకునే పని టీడీపీకి సవాల్‌ గా మారిందట. ఇందుకోసం పార్టీ అధినేత చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 మంది లాయర్లను నియమించుకోవాలని, కేసులు ఎదుర్కుంటున్న‌ వారిని ఆదుకోవాల‌ని నియోజకవర్గ నేతలకు టీడీపీ అధిష్టానం సూచించిందట‌.

 

ఇలా నియోజకవర్గానికో లాయర్ ఏర్పాటు చేసి వీరిని కేంద్ర కార్యాలయంలో లీగల్ టీమ్‌ తో స‌మ‌న్వ‌యం చేయ‌నున్నార‌ట‌. పార్టీకి స‌న్నిహితంగా ఉండే సోషల్‌ మీడియా కార్యకర్తల‌పై కేసులు న‌మోదైతే…ఈ లాయ‌ర్ల‌కు స‌మాచారం అందితే వెంట‌నే స్పందించేలా నిర్ణ‌యం తీసుకున్నార‌ట చంద్ర‌బాబు. మరి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో క్యాడర్‌ లో భయం పోతుందా.. అలాగే బాబు తీసుకున్న ఈ నిర్ణయంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తాడు. అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం ఈ ప్రశ్నలకు కాలం ఎలాంటి సమాధానం ఇస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: