వైసీపీలో నెంబర్ 2గా ముద్ర వేయించుకున్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఆ పార్టీలో అంత ప్రాధాన్యత లేదా..? ఒకప్పుడు పార్టీకి అంతా తానే అయిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు తనకు తానే అయిపోయారా..? ఒకప్పుడు ఆయన చుట్టూ వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా ఉండేవారు.. కానీ, ఇప్పుడు ఆయనే గుంపులో ఒకరిగా అయ్యారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

 

విజయసాయి రెడ్డిని కేవలం మూడు జిల్లాలకు పరిమితం చేస్తూ.. మిగిలిన పది జిల్లాల్లో కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికీ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతల్ని వైవీ సుబ్బారెడ్డికీ అప్పగించారు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి అదనంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బాధ్యతల్ని కూడా సీఎం జగన్ అప్పగించారు. మరి దానికి కారణం ఏంటీ అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

 

అయితే ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిని వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా పదే పదే రావొద్దు అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే కొందరు మంత్రులు కూడా విజయసాయి రెడ్డితో మాట్లాడటం మానేశారు పార్టీలో చర్చ నడుస్తుంది. దీనికి తోడు విజయసాయి రెడ్డికి ఢిల్లీ  బాధ్యతలను కూడా క్రమంగా సీఎం జగన్ తగ్గించే అవకాశం ఉందని, తనకి విస్వాసపాత్రులైన మోపిదేవి, పిల్లి సుభాష్ కి ఢిల్లీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాష్ట్ర రాజకీయాల్లో టాక్.

 

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ సాధించిన ఘన విజయంలో విజయసాయి రెడ్డిది చాలా కీలమైన పాత్ర. మరి అలాంటి విజయసాయిని జగన్ సీఎం అయ్యాక ఎందుకు ఇలా పక్కన పెడుతున్నాడో.. దీనికి గల కారణాలు ఏంటో ఎవరికి అర్ధం కావట్లేదు. చూద్దాం మరి అధినేత తీసుకునే నిర్ణయాలపై విజయసాయి ఏ రకంగా స్పందిస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: