మంచికి మంచి..చెడుకు చెడు..ఇదే భార‌తీయం..మ‌న పూర్వీకుల నుంచి మ‌న ఇతిహాసాల నుంచి నేర్చుకున్న‌ది..చారిత్ర‌క‌, పురాణా గాధాల సారాంశం కూడా అదే చెబుతోంది. స్నేహానికి ప్రాణామిస్తాం..ద్రోహం చేయాల‌ని చూస్తే మాత్రం వారి అంతు చూసేదాక వ‌ద‌లం. చైనా విష‌యంలో మోదీ మంత్రం..రాజ‌తంత్రం కూడా అదే. స్నేహ‌హ‌స్తం అందిస్తే చైనా కాదుపోమ్మ‌ని కయ్యానికి కాలు దువ్వుతోంది. భార‌త్ ఎదుగుద‌ల‌పై ఈర్శ‌, ద్వేషాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ  స‌రిహ‌ద్దులో అల‌జ‌డి సృష్టించాల‌ని చూస్తోంది. అయితే డ్రాగ‌న్ చేస్తున్న ప‌నుల‌కు మోదీ త‌న‌దైన స్టైల్‌లో ట్రీట్‌మెంట్ మొద‌లుపెట్టేసిన‌ట్లు క‌న‌బ‌డుతోంది. 

 

అవ‌స‌ర‌మైతే దేనికైనా రెడీ అని చెప్పేందుకే ప్ర‌ధాని అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ల‌ద్దాక్‌లో ప‌ర్య‌టించ‌డం ఇప్పుడు అంత‌ర్జాతీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సైనికుల్లో మనో నిబ్బ‌రం, దేశ భ‌క్తితో వారు చేస్తున్న సేవ‌ల‌ను భార‌త‌వ‌ని గుర్తిస్తోంద‌ని చాటి చెప్ప‌డానికే ఇంత రిస్క్ చేశార‌న‌డంలో సందేహం లేదు. అదే స‌మ‌యంలో చైనాకు గ‌ట్టి సందేశం పంపారు. మాట‌లే కాదు..అవ‌స‌ర‌మైతే తూటాలు కూడా పేల్చ‌డానికి సిద్ధ‌మే అన్న‌ట్లుగా కూడా వార్నింగ్ ఇచ్చేశారు. వేలాది సంవత్సరాలుగా ఎన్నో దాడులు ఎదుర్కొని, సమర్ధంగా తిప్పికొట్టామని అన్నారు. ఈ భూమి వీరభూమి.. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని, బలహీనులు శాంతిని సాధించలేదు.. శాంతి సాధించాలంటే ధైర్యసహసాలు అవసరమని ఉద్ఘాటించారు. 

 

భారత్ శక్తిసామర్ధ్యాలు అజేయమని అన్నారు. 14 కార్ప్స్ సైనికుల శౌర్య పరాక్రమాల గురించి దేశమంతా మాట్లాడుకుంటోందని అన్నారు. ల‌ఢ‌ఖ్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో చైనా స్పందించింది. ఆయ‌న స‌రిహ‌ద్దుల్లోని మ‌న జ‌వాన్ల‌తో స‌మావేశ‌మైన వారిలో నైతిక స్థైర్యం పెంచేలా ప్ర‌య‌త్నించిన కొద్ది గంట‌ల్లోనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి లిజియాంగ్ మాట్లాడారు. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల‌ను పెంచే ఎటువంటి చ‌ర్య‌ల‌కూ ఇరు దేశాల్లో ఏ ఒక్క‌రూ పూనుకోవ‌ద్ద‌ని అన్నారు. భార‌త్, చైనా మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బరిచేందుకు మిల‌ట‌రీ, దౌత్య ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: