ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా గందరగోళం నెలకొంది. అసలు ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారో.. ఎందుకు విమర్శిస్తున్నారో కూడా అర్ధంకావట్లేదు. అలాగే ఎవరి అలక వెనుక ఏం కారణముందో కూడా అంతుచిక్కట్లేదు. ముఖ్యంగా ఇదంతా అధికార పార్టీకి చెందిన నేతల్లోనే కనబడటం గమనార్హం. ప్రస్తుతం ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఈ విషయం గల్లీ నుంచి ఢిల్లీ దాక పాకిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం కాస్త పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అసలే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన షాక్ కి సతమతం అవుతున్న వైసీపీకి ఇప్పుడు మరో గట్టి షాక్ తగలబోతున్నట్టు సమాచారం. అందేంటంటే..

 

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అలాగే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డిలు కూడా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ర‌గిలి పోతున్నార‌నే ప్రచారంసాగుతోంది. సీఎం జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకడం లేదట.. అలాగే అభివృద్ధి పనుల విషయంలో జిల్లా నాయకులేవరు సహకరించడం లేదట. దీంతో కక్కలేక.. మింగలేక తమలో తామే బాధను అనుభవిస్తున్నారట. నిజానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డిలు ఎన్నిక‌ల‌కు ముందు  టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో గెలిచారు.

 

అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో రెడ్డి సామాజిక వ‌ర్గం హవా ఎక్కువ‌గా నడుస్తుండటం వల్ల తమకి కూడా ఇదే స్థాయిలో ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని వీరు భావించారు. కానీ, వీరు ఆశించింది జరగలేదు.. దానికి ముఖ్య కారణం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నాయ‌కుల‌కు  వీరికి మధ్య సరైన సంబంధాలు లేకపోవడం. పైగా రెండు జిల్లాల్లోని దిగువ శ్రేణి నాయ‌కులంతా జిల్లా మంత్రుల క‌నుస‌న్నల్లోనే నడుస్తుండ‌డంతో ఈ ఎంపీలు ఇద్దరు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రఘురామకృష్ణంరాజు తెచ్చిన తలనొప్పితోనైనా జగన్ గుణపాఠం నేర్చుకుని పార్టీ ఎంపీలందరికీ పెద్దపీఠ వేయడం ఎంతైనా అవసరమని రాజకీయ పరిశీలకు సూచిస్తున్నారు. చూద్దాం మరి సీఎం జగన్ వీరి వ్యవహారంపై ఎలా స్పందిస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: