మన ప్రధానమంత్రి నరేంద్రమోడి వేసిన డేరింగ్ స్టెప్ కు డ్రాగన్ దేశంలో టెన్ష్షన్ పెరిగిపోతోంది. ఊహించని రీతిలో మోడి లడ్డాఖ్ ప్రాంతంలో చేసిన పర్యటనతో చైనాకు షాక్ కొట్టినట్లైంది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఇటువంటి సమయంలో స్పాట్ ను మోడి విజిట్ చేయటమంటే మామూలు విషయం కాదు. లడ్డాఖ్ ప్రాంతంలో డిఫెన్స్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటిస్తారంటూ గడచిన మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా మోడి లడ్డాఖ్ లో పర్యటనను ఎవరూ ఊహించలేదు. మనదేశంలో చాలామంది మోడి స్టెప్ కు ఆశ్చర్యపోతే చైనాకు  మాత్రం షాక్ కొట్టిందనే చెప్పాలి.

 

అందుకనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝూన్ లిజియున్ లబలబలాడుతున్నాడు. ఉద్రిక్త పరిస్ధితులున్న ప్రాంతాల్లో మోడి పర్యటించటం ఎంతమాత్రం తగదంటూ గోల పెట్టేస్తున్నాడు. రెండు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న ఈ సమయంలో మోడి పర్యటనతో మరింత టెన్షన్ పెరిగిపోతుందంటూ యాగీ మొదలుపెట్టింది చైనా  విదేశాంగ శాఖ. ప్రధానమంత్రి లడ్డాఖ్ పర్యటనకు తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది. నిజానికి మోడి పర్యటించింది భారత్ భూభాగంలోనే అన్న విషయాన్ని బహుశా డ్రాగన్ మరచిపోయిందేమో.

 

మన భూభాగంలో ప్రధానమంత్రి పర్యటిస్తే చైనాకు అభ్యంతరం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. లడ్డాఖ్ ప్రాంతంలో పర్యటించిన ప్రధాని ఆర్మీ, వైమానిక దళాల్లోని ఉన్నతాధికారులతో సమావేశం జరిపాడు. సైనికులను ఉద్దేశించి ప్రసంగించాడు. వారిలో ఉత్తేజాన్ని నింపాడు. గాల్వాన్ నదీ ప్రాంతంలో డ్రాగన్ దేశ సైనికులను తరిమికొట్టిన సైనికులకు ప్రధాని శాల్యూట్ చేశాడు. మన భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకు వచ్చిన ప్రాంతాన్ని, రెండుదేశాల సైనికులకు ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని సైన్యాధికారులు మోడికి దగ్గరుండి మరీ చూపించారు. మొత్తానికి సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తున ఉన్న ’నిము’ పర్వత  ప్రాంతంలో మోడి పర్యటించటం సంచలనమనే చెప్పాలి.

 

ఆర్టికల్ 370 రద్దు, కరోనా వైరస్ నేపధ్యంలో జమ్మూ-కాశ్మీర్ లో కూడా సంపూర్ణ లాక్ డౌన్ విధించటం, లడ్డాఖ్ ప్రాంతాన్ని కేంద్రం తన పరిధిలోకి తీసుకోవటం లాంటి అనేక చర్యలు ఇటు పాకిస్ధాన్, అటు చైనాలో టెన్షన్ పెంచేస్తున్నాయి.  అలాగే వివాదాస్పద ప్రాంతాల్లో మన ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఎయిర్ బేస్, హెలికాప్టర్లు దిగటానికి అనువైన వేదికలను నిర్మించటాన్ని  పై రెండు దేశాలు ఏమాత్రం సహించలేకపోతున్నాయి. వీటన్నిటి మీద చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధించటం చైనా ఆర్ధికపరిస్ధితిపై ప్రభావం చూపుతాయనటంలో సందేహం లేదు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకునే  మోడి తాజా పర్యటనపై డ్రాగన్ మండిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: