2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకుని అధికారం చేపట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన మాట.. కేవలం ఆరు నెలల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని. కానీ, జగన్ ఇప్పటికి అధికారం చేపట్టి సంవత్సరకాలం దాటింది. మరి ఆయన చెప్పినట్టుగానే మంచి సీఎం అనిపించుకున్నారా.? సీఎం జగన్ నిర్ణయాలకు ప్రజలు జై కొడుతున్నారా.? ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజలకు చేరుతుందా.?

 

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డారు మన ముఖ్యమంత్రి. ఈ నేపధ్యంలో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం రచ్చబండ అనే పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారట. ప్రజల్లోకి వెళ్ళడం మంచి పనే.. కానీ, ఇక్కడే సీఎం జగన్ కి ఒక సెంటిమెంట్ అడ్డం వస్తుందని అంటున్నారు వైసీపీ కీలక నేతలు. అదేంటంటే.. గతంలో 2009లో రెండవ సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

 

రెండవ సారి అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రజల నాడి తెలుసుకునేందుకు అత్యంత తక్కువ సమయంలోనే ప్రజలతో నేరుగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు రాజశేఖర్ రెడ్డి. కానీ, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ నిర్వహణకు బయలుదేరిన రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు అదే రీతిలో సీఎం జగన్ కూడా రచ్చబండకు రెడీ అయ్యారు. కానీ జగన్ తల్లి విజయమ్మకు మాత్రం ఇది ఇష్టం లేదట..

 

అయితే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించి దీనికి మరో పేరు పెట్టుకోవాలని సూచించారట. దీంతో గ్రామ సభ అనే పేరును ఖరారు చేయనున్నట్లు తెలిసింది. అలాగే ఈ కార్యక్రమానికి హెలికాప్టర్ వినియోగించకూడదని సీఎం జగన్ ని పార్టీ సీనియర్లు కోరుతున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డి కూడా దీనికి ఒకే చెప్పినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: