సుంకరి బిక్ష‌ప‌తి


నిజాం నిరంకుశ పాల‌న‌లో దోపిడి పీడ‌న‌లో మ‌గ్గిపోతున్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డి పోరు చేసిన వీర‌యోధులు ఎంద‌రో.. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం అమ‌రులైన అమ‌రులెంద‌రో.. అలా బానిస సంకేళ్ళ విముక్తి కోసం పోరాడి వీర‌మ‌ర‌ణం పొందిన తొలి అమ‌రుడు దొడ్డి కొమ‌ర‌య్య 74వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా అందిస్తున్న క‌థ‌నం.. అవి నిజాం రాజు పాలిస్తున్న కాలం.. న‌ల్ల‌గొండ జిల్లా జ‌న‌గామ తాలుకా (ప్ర‌స్తుతం జ‌న‌గామ జిల్లా) విస్నూర్ ప్రాంతం... ఈ ఊరు పేరు చెపితే జ‌నాల్లో వ‌ణుకు.. ప‌సిపిల్ల‌ల నుంచి ముస‌లివాళ్ళ వ‌ర‌కు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయేవారు. నిజాం న‌వాబుకు న‌మ్మిన‌బంటు ఖాసీంర‌జ్వీ.. ఖాసీంర‌జ్వీ నాయ‌కత్వంలో ఏర్పాటైన ర‌జాకారు సైన్యంకు ఉప‌నాయ‌కుడు రాపాక రామ‌చంద్రారెడ్డి. ఇత‌డే విస్నూర్‌ దేశ్‌ముఖ్‌. 60గ్రామాల‌కు తిరుగులేని నాయ‌కుడు. విస్నూర్ కేంద్రంగా చేసుకుని 60గ్రామాల్లో పాల‌న సాగించేవాడు. 

 

నిజాం నవాబుకు ప‌న్నులు వ‌సూలు చేస్తూ త‌న ప్రాంతాన్ని పాలించేవాడు దేశ్‌ముఖ్. ఖాసీంర‌జ్వీ నిజాం న‌వాబు కోసం ర‌జాకారు సైన్యంను ఏర్పాటు చేశాడు. ర‌జాకారు అంటే స్వ‌యం సేవ‌కులు అని అర్థం.. అయితే విస్నూర్ దేశ్‌ముఖ్ కు అనుకూలంగా ర‌జాకారు సైన్యం ప‌నిచేసేంది. అయితే ర‌జాకారు సైన్యం స్వ‌యం సేవ చేయ‌డం మానేసి.. గ్రామాల‌ను దోచుకోవ‌డం, మ‌హిళ‌ల‌ను చెర‌చ‌డం, బాలింత‌లను వేధించ‌డం.. పసిపిల్ల‌ల‌కు పాలివ్వ‌కుండా ఆకు డొప్ప‌ల్లో ప‌ట్టివ్వ‌డం వంటి నికృష్ట ప‌నులు చేసే సైన్యం త‌యారైంది. ఎదురు తిరిగిన వారిని హ‌తం చేయ‌డం, భూములు లాక్కోవ‌డం, ఇండ్లు కాల్చివేయ‌డం, దోపిడిలు చేయ‌డం వంటి దుర్మార్గ‌మైన ప‌నులు చేయ‌డం ర‌జాకార్ల నిత్య‌కృత్యం అయింది. దీంతో దేశ్‌ముఖ్ ఒక ఆరాచ‌క‌వాదిగా జ‌నం దృష్టిలో ముద్ర‌ప‌డిపోయాడు. 

 

నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన మహత్తరమైన ప్రజా పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పొరాటం. భూమి, భుక్తి, విముక్తి, అనే మౌలిక హక్కుల కొరకు ఉద్యమించిన హైదరాబాద్‌ రాజ్య ప్రజలు వీరోచిత పోరాటాలు చేశారు. నిజాం ప్రభువుల పాలనకు మూలస్తంభాలుగా నిలిచిన భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, అవినీతి అధికారులను పారదోలారు. ఈ క్రమంలో విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రరెడ్డి ఆకృత్యాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామంలో సాగించిన పోరాటం స్ఫూర్తివంతమైనదిగా నిలిచిపోయింది. ఈ పోరాటంలోనే తుపాకీ తూటాలకు బలయిన దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమరవీరునిగా చరిత్రకెక్కారు. నేటికి దొడ్డి కొమర‌య్య అమ‌ర‌త్వం పొంది 74ఏండ్లు కావ‌స్తుంది.

 

అయితే ఇదే క్ర‌మంలో గ్రామాల్లో జ‌రుగుతున్న వెట్టిచాకిరి విముక్తి కోసం, బానిస బ‌తుకులు బాగు చేసేందుకు వ‌చ్చిన తెలంగాణ సాయుధ పోరాటం కు భువ‌నగిరి ప్రాంతంగా భీజం ప‌డింది. ఇదే భూమి కోసం.. భూక్తి కోసం..బానిస బంధాల నుంచి విముక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. నైజాం దేశ్‌ముఖ్‌ల కుట్రలతో చిందిన కొమురయ్య రక్తంతో తెలంగాణ రక్తసిక్తమైంది. బాంచెన్ దొర కాల్మొక్తా అంటూ దొర పెత్తనం లో నలిగిన వాళ్ల ను బందూకులు చెత బట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు దొడ్డి కొము రయ్య. దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో 1928లో దొడ్డి గట్టమ్మ, కొండయ్య దంపతులకు దడ్డి కొమురయ్య జన్మించాడు. 

 

కొమురయ్య 16వ ఏట 1944లో కొమురమ్మతో వివాహాం జరిగింది. ఈ క్రమంలో పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని 60 గ్రామాలను దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి , ఆయన భార్య జానకమ్మ దొరసాని, కుమారుడు బాబు దొర ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ అన్ని రకాలుగా పీడించే వారు. ప్రజల మాన, ప్రాణాలతో చేలగాటమాడేవారు.1943లో జరిగిన ఆంద్రమహాపభలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడాలని ఉద్యమకారులు నిర్ణయించుకున్నారు. కడవెండి గ్రామానికి చెందిన నల్ల నర్సింహులు, దొడ్డి కొమురయ్య, దావిద్ రెడ్డి, వడ్డె నర్సయ్య, నల్ల కొండయ్య, మచ్చ రామయ్య, జంపాల లింగయ్య, పంతం లచ్చయ్య, పాముకుంట్ల ముత్తిలింగం, మాశెట్టి రాంచంద్రయ్య, ఎర్రంరెడ్డి రాంకృష్ణారెడ్డి, పైండ్ల యాదగిరి తదితరులు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఈ ప్రాంతం నుంచి ఊపిరి ఊదారు. 

 

బానిస సంకేళ్ళతో విసిగివేసారిన జనం తిరగబడ్డ చరిత్ర.. ఎంతో మంది తమ ప్రాణాలను లెక్కచేయ కుండా పోరాడిన త్యాగ చరిత్ర.. ప్రపంచంలోని పీడిత ప్రజల్లో ఉద్యమస్పూర్తిని రగిల్చింది. కడవెండిలో నిజాం నిరంకుశ పాలనను వ్యతిరెకిస్తూ జానమ్మ దొరసాని దాష్టికాలకు స్వస్తి పలికేందుకు పీడిత ప్రజలు ఎర్రజెండా నీడలో పోరు సలిపారు. భూమి కోసం..భూక్తి కోసం…వెట్టి చాకిరి విముక్తి కోసం… ఆనాడు కడవెండిలో అంకురార్పణ జరిగిన పోరాటాల చరిత్రను రష్యా సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచారు.

 

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో అత్యదిక భూములు దొర ఆదినం లో ఉండేవి. విస్నూరు దేశ్‌ముఖ్ తల్లి జానమ్మ కడవెండినే కేంద్రంగా చేసుకొని గ్రామంలో తన హింసాకాండాను కొనసాగించింది. భూములను ఆక్రమించు కోవడం, కూలీలతో వెట్టి చాకిరి చెయించుకోవడం, తన మాట వినని వారిని చంపించడం, మహిళలను అవమానించడం, పన్నుల పేరుతో దోచుకు నేది. ఈ పర్యవసానంలోనే ఆంధ్ర మహసభ అవిర్బవించింది. గ్రామంలోని నల్ల నర్సిం హులు, ఎర్రంరెడ్డి కొండల్ రెడ్డితో పాటు గుంటూరు నుంచి వచ్చిన కొందరు సెటిలర్లు ఈ సంఘాలకు ప్రాతినిధ్యం వహించి దొరకు ఎదురు తిరిగేవారు. దొడ్డి మల్లయ్య సంఘంలో చురుకైన కార్యకర్త అతడి తమ్ముడే దొడ్డి కొమురయ్య. 18 వయసున్న ఈ యువకుడికి దొరసాని చర్యలంటే రక్తం మరిగేది. ఆ రోజు 1946 జూలై 4 సంఘపోళ్లు దొరసాని , ఆమె గుండాల చర్యలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆంధ్రమ హసభకు జై.. కమ్యూనిస్టుకు జై… అంటూ నినాదాలు చేశారు.

 

అప్పుడే గొర్రెల ను దొడ్డిలో తోలి కాళ్లూ చేతులు కడుక్కొని వదిన అన్నం పెట్టగా తింటు న్న కొమురయ్య వదిన అన్న ఎటు పోయిండు అని అడిగాడు. సంఘపోళ్లు తీసుకుపోయిండ్రు అని చెప్పగాఅంతలోనే నినాదాలు అతని చెవికి తాకాయి. అన్నం వదిలి అన్నకు రక్షణగా పోతానంటూ వదినకు చెప్పి గుతప పట్టుకొని కచ్చీరు కాడికి చేరాడు. జులూస్‌లో అన్న దొడ్డి మల్లయ్య, కొమురయ్య ముందు వరుసలో ఉంటూ దొరకు వ్యతికేకంగా నినిదాలు చేస్తున్నారు. దీంతో దొరసాని జానమ్మ, ఆమే గూండాల గుండెలు గుబేలుమన్నాయి. జానమ్మ తనను ఏం చేస్తారోనని భయపడి గడి నుంచి మిస్కిన్ అలీ తో కాల్పులు జరిపించింది. దీంతో ముందు వరుసలో ఉన్న కొమురయ్య పొట్టలో బుల్లెట్లు దిగాయి. పేగులు బయటకు వస్తుండగా ఎడమ చేతితో వత్తుతూ ఆంధ్ర మహసభకు జై అంటూ నినిదాలు చేస్తు నేలకొరిగాడు. మరో బుల్లెట్ తన అన్న మల్లయ్య మోకాలుకు తాకగా మరిన్ని బుల్లెట్లు అదే గ్రామానికి చెందిన సంఘం సభ్యులు రేషపల్లి కొండయ్య, రేషపల్లి లక్ష్మీనర్సయ్య తలభాగంలో తాకాయి. గూండాలు నశించాలి, తుపాకులు మమ్మల్ని ఏమీ చేయలే వంటూ నినాదాలు చేశారు. 

 

కొము రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడు. దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. కొమురయ్య మరణంతో జానమ్మ దొరసాని వ్యవసాయ పనికి గానీ, ఇంటి పనికి గానీ, ఎవరూ పోవద్దని ఆంధ్రమహసభ పిలుపునివ్వడంతో ఆనాడే సహయనిరాకరణ మొదలైంది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా ఎవరూ పనికి రావద్దని సంఘపోళ్లు అనడంతో దొరసాని వ్యవసాయం పడావుపడింది. దీంతో జానమ్మ తిరిగి విస్నూరు వెళ్లిపోయింది. ఆ తర్వాత‌ సంఘ కార్యక్రమాలు ఉదృతమై మరో పోరాటానికి నాంది పలికాయి. తెలంగాణ కు స్వేచ్చా వాయువులు ప్రసాదించిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మ‌హోజ్వ‌లం అయింది. తెలంగాణ సాయుధ పోరాటం చ‌రిత్ర‌లో అజ‌రామ‌రంగా నిలిచిపోయింది. దొడ్డి కొమర‌య్య‌ను స్ఫూర్తిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం పాల‌కులు చేయాల్సిన త‌రుణ‌మిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: