తెలంగాణ‌లో రాజ‌కీయ‌మంతా క‌రోనా చుట్టూ..కేసీఆర్ కేంద్ర బిందువుగా కొన‌సాగుతున్నాయి. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాల‌పై, ప్ర‌క‌ట‌న‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్‌తో పాటు ఇత‌ర ప‌క్షాలు  ప్ర‌తిస్పంద‌న ఉంటోంది. ఇందులో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు క‌ల‌గ‌లిపి అధికార పార్టీపై విసురుతున్నారు. అయితే అదే స‌మ‌యంలో అధికార పార్టీకి చెందిన కొంత‌మంది ఎమ్మెల్యేలు స్పందిస్తున్నా...ఎక్కువ మంది మాత్రం క‌రోనా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతుండ‌గా విమ‌ర్శ‌లకు స‌రైన స‌మాధానాలు చెప్ప‌లేని ప‌రిస్థితి వారికి ఎదుర‌వుతున్నాయి. 

 

వాస్త‌వానికి ప్ర‌భుత్వ ప‌రంగా మిగ‌తా అన్ని విష‌యాల్లో భేష్ అనిపించుకున్నా..క‌రోనాను నియంత్రించ‌డంలో, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌న‌లో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్లు క‌న‌బ‌డుతోంద‌న్న వాద‌న సొంత పార్టీ నాయ‌కుల నుంచే వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. క‌రోనా విష‌యంలో మంత్రుల స్థాయి నేత‌లు కూడా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో విప‌క్షాలు మ‌రింత స్వ‌రం పెంచేస్తున్నాయి. క‌రోనా కష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తూ వ‌స్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం లేఖ రాశారు. లాక్‌డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 

 

పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు చిన్న పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. అధిక మొత్తంలో వచ్చిన బిల్లులపై టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని అన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మ‌రోవైపు కేసీఆర్ ఫాంహౌస్‌లో ప‌డ‌కేశాడు..ప్ర‌జ‌ల‌ను పట్టించుకోవ‌డం లేద‌ని త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా.. ఆరోప‌ణ‌లు చేసినా..లేఖ‌లు రాసినా..విన్న‌పాలు వినిపించినా అధికార పార్టీ నుంచి స‌మాధానం క‌రువ‌వ‌డం విశేషం.  మునుపెన్న‌డూ ఇలాంటి రాజ‌కీయ ధోర‌ణిని మేం చూసి ఉండ‌ట‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు వాపోతున్నారు.

 

మ‌రోవైపు తెలంగాణలో కరోనా కోరలు చాచుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య 1000పై బడి నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నగరంలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,590 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,902కు చేరింది. తాజాగా కరోనాతో 7 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 295కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 1,277 పుట్టుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: