క‌రోనా భ‌యం...లాక్‌డౌన్ ఆంక్ష‌లు..ప‌రిశ్ర‌మ‌ల మూత‌..ఫ్యాక్ట‌రీ ఉద్యోగాల్లో కోత‌..స‌గంస‌గం జీతాలు..న‌మ్ముకున్న చిరు వ్యాపారం దెబ్బ‌తిన‌డం...అద్దె కూడా క‌ట్ట‌లేని స్థితి..పెరుగుతున్న అప్పులు...పూట గ‌డ‌వ‌డానికే తిప్ప‌లు..మొత్తంగా ఊరి ర‌మ్మంది..ప‌ట్నం పోమ్మ‌న‌డంతో దిన‌స‌రి కూలీలు, చిరువ్యాపారులు, ఫ్యాక్ట‌రీల్లోని కార్మికులు ప‌ల్లెల‌కు చేరుకుంటున్నారు. ఏదైనా వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకునైనా బ‌తుకుతామ‌ని చెప్పి..బాధ‌తో ప‌ట్ట‌ణాల‌ను విడుస్తున్నారు. ఇది తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే ప‌రిమితం కాదు. దేశ వ్యాప్తంగా కూడా ఇదే ప‌రిస్థితి. ఉపాధిని, ఉద్యోగ‌, చిరువ్యాపారాల‌ను వెతుక్కుంటూ ప‌ట్నం చేరిన వారు..క‌రోనా దెబ్బ‌తో తిరిగి పొట్ట చేత ప‌ట్టుకుని పుట్టి పెరిగిన ప‌ల్లెకు చేరుకుంటున్నారు.

 

క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా...ఈశాన్య రాష్ట్రాల నుంచి ప‌డ‌మ‌ర గుజ‌రాత్ రాష్ట్రం వ‌ర‌కు అదే ప‌రిస్థితి.  కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాకే తిరిగి ప‌ట్నానికి వస్తామని అంటున్నారు. ఇక హైద‌రాబాద్‌లో అయితే తెల్లారి నుంచే  బస్టాండ్లు, బిజీగా కనిపిస్తున్నాయి. సొంత, ప్రైవేటు వాహనాల్లోనూ జనం ఊరిబాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లకు రెండ్రోజులుగా డిమాండ్‌ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ జిల్లాలకు హైదరాబాద్‌ నుంచి వెయ్యి బస్సులు నడుస్తున్నాయి. ‘ప్రయాణికుల డిమాండ్‌ ఇలాగే ఉంటే మరికొన్ని బస్సులను అందుబాటులోకి తెస్తామ‌ని  ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైద‌రాబాద్ నుంచి కూలీలు క‌దిలిపోతుండ‌టంతో పారిశ్రామిక వాడ‌లు క‌ళ త‌ప్పిపోతున్నాయి.

 

మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి ప్రస్తుతం రోజుకు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 30 వేల మంది తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే తెలంగాణ గ‌వ‌ర్న‌మెంటు లాక్‌డౌన్ ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చినా జ‌నంలో మాత్రం ఆ భ‌యం వెంటాడుతూనే ఉంది. ఎందుకైనా మంచిద‌నే ధోర‌ణితో ముందే నిత్యావ‌స‌రాల‌ను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. మళ్లీ లాక్ డౌన్ పెడితే తమ బతుకు ఏమవుతుందోనని చిన్నచిన్న దుకాణాలు, మెకానిక్ లు, ఇతర స్వయం ఉపాధి పనులు చేసుకునేవాళ్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: