పరిశ్రమల్లో స్ధానికులకే 75 శాతం రిజర్వేషన్ అన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. ఈ నిర్ణయం అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియా కూడా జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పట్లో ఎంతగా గింజుకున్నది అందరు చూసిందే. జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ అప్పట్లో ఎల్లోమీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వార్చింది. 75 శాతం రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు, ఎల్లోమీడియా ఎందుకంతగా గింజుకున్నాయి ? ఎందుకంటే జగన్ నిర్ణయం తూచా తప్పకుండా అమల్లోకి వస్తే రాష్ట్రంలోని యువతకు బాగా లబ్ది జరుగుతుంది. దాంతో లబ్దిపొందిన వాళ్ళెవరు మళ్ళీ తెలుగుదేశంపార్టీవైపు చూసే అవకాశం ఉందదన్న టెన్షనే ప్రధాన కారణం.

 

నిజానికి ఇటువంటి నిర్ణయమే అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా తీసుకున్నాడు. అయితే ఆ నిర్ణయం అమల్లోకి రాలేదు. కారణం ఏమిటంటే 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు తర్వాత తుంగలో తొక్కేయటమే.  అనంతపురం జిల్లాలోని పెనుగొండ ప్రాంతంలో ఏర్పడిన కియా మోటార్స్ ఘటనే ఉదాహరణ. కియా మోటార్స్ ఏర్పాటు తర్వాత స్ధానికులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉద్యోగాలపై ఆశతోనే స్ధానిక రైతులు తమ పొలాలను కంపెనీకి ఇచ్చారు. కార్ల  ప్రొడక్షన్ మొదలయ్యేటప్పటికి ఉద్యోగాల కోసం స్ధానికులు చేసిన డిమాండ్ ను కియా మోటార్స్ పట్టించుకోలేదు. ఇదే విషయమై ఎంత గోల జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

 

సరే అసలు విషయానికి వస్తే జగన్ తీసుకున్న నిర్ణయానికి తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో కూడా మద్దతు పెరిగిపోయింది. తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. తాజాగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ధానికులకే 75 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని డిసైడ్ చేయటం గమనార్హం.  ఇక్కడ గమనించాల్సిందేమంటే హర్యానాలో బిజెపి ప్రభుత్వం జననాయక్ జనతాపార్టీ మద్దతుపై ఆధారపడుంది. మొన్నటి ఎన్నికల సమయంలో జననాయక్ పార్టీ స్ధానికులకు 75 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చింది. ఎప్పుడైతే తమ మద్దతుతో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది తమ హామీని జననాయక్ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా తెరమీదకు తెచ్చాడు. దాంతో దానికి బిజెపి అంగీకరించక తప్పలేదు. తాజాగా ఈ మేరకు  75 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది.

 

అంటే  జగన్ తీసుకున్న నిర్ణయం ఎన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోందో అందరికీ అర్ధమైపోతోంది. బహుశా తొందరలోనే మరిన్ని రాష్ట్రాలు ఇదే నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  ఎక్కడికక్కడ రాష్ట్రప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే స్ధానికయువతకు ఉద్యోగాలు దక్కే అవకాశాలు తగ్గిపోతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో స్ధానికుల్లో ప్రధానంగా యువతలో అసంతృప్తి మొదలవుతుంది. చివరకు అది ఆందోళనలకు దారితీస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్ధితులను ముందుగా ఊహించే జగన్ స్ధానికులకు 75 శాతం రిజర్వేషన్ అనే హామీని ఇచ్చి అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: