ప్రపంచ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఏమి జరుగుతోందో తెలుసా ?  ఊహించనిరీతిలో  కరోనా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికి బయటపడిన కేసులు 44. పరీక్షలు నిర్వహించకుండా, చేసిన పరీక్షల రిజల్ట్స్ బయటపడకుండా కరోనా వైరస్ ఎంతమందికి సోకిందో తెలీక చాలామందిలో టెన్షన్ పెరిగిపోతోంది. చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా తిరుమల ఆలయాన్ని కరోనా వైరస్ కారణంగానే మూసేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు రెండు మాసాల మూసివేత తర్వాత కొన్ని షరతులతో మళ్ళీ ఈ మధ్యనే శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. ప్రయోగాత్మకంగా ముందు ఓ ఐదురోజుల పాటు ఆలయాన్ని తెరిచి ఉద్యోగులను, భక్తులను దర్శనానికి అనుమతించారు. అయితే ప్రయోగాత్మక దశలో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదు. అందుకనే మిగిలిన భక్తలకు కూడా శ్రీవారి దర్శనభాగ్యాన్ని కల్పించాలని అధికారులు డిసైడ్ చేశారు.

 

ఈ కారణంగా ఆన్ లైన్లో దర్శన టిక్కెట్లను అమ్మకాలు మొదలుపెట్టారు. దాంతో దేశం నలుమూలల నుండి భక్తులు తిరుమల చేరుకోవటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే తిరుమలలో భక్తుల రద్దీ మొదలైందో వెంటనే కరోనా వైరస్ సమస్య కూడా తిరుమలలో మొదలైంది. తిరుపతిలోని అలిపిరి దగ్గర భక్తులందరికీ స్క్రీనింగ్, కరోనా పరీక్షలు చేస్తున్నమాట వాస్తవమే. అయితే స్క్రీనింగ్ పరీక్షల్లో ఎవరికైనా జ్వర లక్షణాలున్నట్లు తేలితే వాళ్ళని మాత్రం అక్కడ నుండి వెనక్కు పంపేస్తున్నారు. ఎటువంటి లక్షణాలు బయటపడని వాళ్ళని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. అయితే కరోనా వైరస్ ఉండి, లక్షణాలు బయటపడిన వాళ్ళతోనే అసలు సమస్య పెరిగిపోతోంది. వీళ్ళ ద్వారానే తిరుమలలో మిగిలిన వాళ్ళకు కూడా వైరస్ సోకుతున్నట్లు అనుమానిస్తున్నారు.

 

టిటిడి అధికారుల సమాచారం ప్రకారమే తిరుమలలో 44 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. వీరిలో విజిలెన్స్ అధికారులు, మామూలు పోలీసులు, అర్చకులు, ఆలయ అధికారులతో పాటు కొందరు స్ధానియకులున్నట్లు సమాచారం. ప్రస్తుతం తిరుమలకు రోజుకు 12 వేలమంది భక్తులు సగటున వస్తున్నారు. వీరిలో ఎంతమందికి వైరస్ ఉన్నదనే విషయం టిటిడి అధికారుల దగ్గర లెక్కలు లేవు. అలిపిరి స్క్రీనింగ్ లో జ్వర లక్షణాలు లేవనంగానే అందరినీ తిరుమలకు అనుమతిస్తున్నారు.  వీళ్ళల్లో కొందరి ద్వారానే వైరస్ ఇతరకుల సోకుంటుందని అనుమానిస్తున్నారు. అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తిరుమలకు వస్తున్న భక్తుల ద్వారానే  వైరస్ వ్యాపిస్తోందనే వాదనకు బలం పెరుగుతోంది.

 

ఇదే విషయమై టిటిడి అధికారులు రివ్యు చేస్తున్నారు. భక్తులను దర్శనానికి అనుమతించి వైరస్ వ్యాప్తికి కారణం అవటమా ? లేకపోతే మళ్ళీ దర్శనాలను కొంత కాలంపాటు దర్శనాలను నిలిపేయటమా ? అన్న విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఉన్నతాధికారులు ఏ పద్దతికి మొగ్గు చూపుతారో చూడాల్సిందే. ఒకసారి వైరస్ వ్యాప్తంటూ పెరిగిపోతే దాన్ని అరికట్టడం టిటిడి అధికారుల చేతుల్లో ఉండదన్న మాట వాస్తవం. కాబట్టి మెజారిటి అధికారులు మళ్ళీ శ్రీవారి దర్శనానికి బ్రేక్ వేయించేందుకే మొగ్గు చూపబోతున్నట్లు అనిపిస్తోంది.  ఇదే విషయాన్ని ఓసారి ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చలు జరిపి, ప్రభుత్వంతో కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మరి చూడాలి బోర్డు నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తుందో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: