ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా గందరగోళం నెలకొంది. అసలు ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారో.. ఎందుకు విమర్శిస్తున్నారో కూడా అర్ధంకావట్లేదు. అలాగే ఎవరి అలక వెనుక ఏం కారణముందో కూడా అంతుచిక్కట్లేదు. ముఖ్యంగా ఇదంతా అధికార పార్టీకి చెందిన నేతల్లోనే కనబడటం గమనార్హం. ప్రస్తుతం ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఈ విషయం గల్లీ నుంచి ఢిల్లీ దాక పాకిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం కాస్త పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే ఇంకా రఘురామకృష్ణంరాజు స్టోరీని మరవకముందే ఇప్పుడు మరో వైసీపీ నేత వ్యవహారం రాష్ట్రలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మరెవరో కాదు.. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.

 

2019 ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున పీవీపీ పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్.. టీడీపీ నేత కేశినేని నాని చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుంచి ఆయన నిత్యం ఏదోక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. తాజాగా.. హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పొట్లూరి వరప్రసాద్ పై కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేశారని, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై పెంపుడు కుక్కులను వదిలారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

 

అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ఆయనకోశం గాలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పీవీపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. “శాంతి సందేశం పంపిస్తున్న చైనా ! హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా డిజిటల్ స్ట్రైక్స్ మరియు దౌత్యం  ద్వారా వెనక్కి నెట్టిన నరేంద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు” అని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పీవీపీ. అయితే పోలీసులు అరెస్ట్ చేసేందుకు చూస్తున్న సమయంలో పీవీపీ, మోదీని పొగడటం చూస్తుంటే.. ఆయన బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తునట్టు అర్ధం అవుతుంది. త్వరలో ఆయన కూడా రఘురామ కృష్ణంరాజు బాట పట్టానున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: