వ్లాదిమిర్ పుతిన్ గతంలో 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 1999 నుండి 2000 వరకు, తిరిగి 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు. ర‌ష్యా ప‌రిపాల‌న కోస‌మే పుట్టాడా..? అన్న‌ట్లుగా ఉంది ఆయ‌న చ‌రిత్ర‌. ఇప్పుడు స‌రికొత్త రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లో ఏకంగా 2036వ‌ర‌కు ఆయ‌న అధ్య‌క్షుడి హోదాలో కొన‌సాగేందుకు ఆ దేశ  78శాతం మంది ప్ర‌జ‌లు ఆమోదం తెల‌ప‌డం గ‌మ‌నార్హం.  ఇరవయ్యేళ్ళుగా రష్యా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారాన్ని అనుభవిస్తున్న వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇక 2036వరకూ తానే దేశాధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. రష్యాలో ఓ వ్యక్తి వరుసగా రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టే వీలు లేదు.

 

 అయితే, తాజా సంస్కరణల ద్వారా ఆ నిబంధనను వరుసగా రెండు సార్లకు బదులుగా, రెండు సార్లుగా మార్చారు. ఇదివరకు అధ్యక్ష పదవి చేపట్టిన పర్యాయాలు ఇందులో లెక్కకురావని కూడా నిబంధన పెట్టారు. ఇలా మరో రెండు సార్లు ఆరేళ్ల చొప్పున అధ్యక్ష పదవి చేపట్టేందుకు పుతిన్‌కు వీలు కల్పించారు. సంస్కరణలను సమర్థిస్తూ 77.9 శాతం ఓట్లు, వ్యతిరేకిస్తూ 21.3 శాతం ఓట్లు వచ్చాయని రష్యా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  కొత్త రాజ్యాంగం ఆయనకు సరికొత్త అధ్యక్ష జీవితాన్ని ప్రసాదించబోతున్నది. గతంలో అనుభవించిన పదవీకాలమంతా గాలికి కొట్టుకుపోయి, 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన తిరిగి అధ్యక్షపదవికి పోటీ పడవచ్చు. 

 

నిజంగానే ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో ఆయనే తమ పాలకుడిగా కొనసాగాలని కోరుకున్నారా? అంటే  విపక్షనాయకులు, హక్కుల సంఘాల నుంచి మాత్రం విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ రెఫరెండమ్‌ ఓ పచ్చి అబద్ధం, కరోనా పేరిట ఏకంగా వారం పాటు సాగిన ఈ ప్రక్రియలో కొద్దిమంది ప్రత్యక్షంగా ఓటేస్తే, ఆన్‌లైన్‌లో పడిన ఓట్లే ఎక్కువ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ర‌ష్యాకు రెండోసారి పుతిన్ అధ్య‌క్షుడ‌య్యాక అనేక మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. అందులో ప్ర‌ధాన‌మైన‌ది బాల్యం నుంచే దేశ‌భ‌క్తిని నూరిపోస్తుండ‌టం. ఇదే ఇప్పుడు పుతిన్‌కు కోట్లాది మంది ర‌ష్యన్ల‌ను అభిమానుల‌ను చేసేసింది.అధికార మీడియా రాజ్యాంగ సవరణల ఆవశ్యకతను విస్తృతంగా ప్రచారం చేసి, దేశభక్తి, దైవభక్తి రగల్చింది. పుతిన్‌ మరోమారు ఎన్నికల్లో పాల్గొని అధ్యక్షుడయ్యేందుకు, 2036వరకూ దేశాన్ని ఏలేందుకు మీ అభిప్రాయం తోడ్పడుతుందన్న విషయం మాత్రం ప్రచారంలోకి రానివ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: