త‌న‌ను న‌మ్మిన‌వారిని.. తాను న‌మ్మిన వారిని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎలా గ‌ట్టెక్కిస్తారో చెప్ప‌డానికి చాలానే ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒక ఘ‌ట‌న ఇది.. అది.. 2009 ఎన్నిక‌ల స‌మ‌యం. ఉమ్మ‌డి రాష్ట్రంలో హోరా హోరీ ఎన్నిక‌లు. అప్ప‌టి సీఎం వైఎస్ రాజ ‌శేఖ‌ర‌రెడ్డిని నిలువ‌రించేందుకు, కాంగ్రెస్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌తిప‌క్షాలు మూకుమ్మ‌డిగా జ‌ట్టుక‌ట్టిన ప‌రిస్థితి! అదేస‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన నాయ‌కుల‌ను రంగంలోకి దింపిన వాతావార ‌ణం. గెలుపు గుర్రం ఎక్క‌డం అనేది ఎవ‌రికైనా చాలా క‌ష్ట‌మే. దీనికి కారణం.. మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విప‌క్షాలు.. ఒక‌వైపు.. కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టి ఒక‌వైపు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ రెండో సారి అధికారంలోకి వ‌స్తుందా?  రాదా? అనే విష‌యంక‌న్నా.. అస‌లు అభ్య‌ర్థులైనా గెలుస్తారా?  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా అయినా ద‌క్కుతుందా? అనే సందేహం మ‌రోవైపు వేధించింది. 

 

ఇలాంటి స‌మ‌యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత ఆప్తుడు, మేధావి, ప్ర‌ముఖ లాయ‌ర్‌.. అప్ప‌టికే రాజ‌మండ్రి ఎంపీగా చ‌క్రం తిప్పుతున్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాజ‌మండ్రి నుంచి బ‌రిలో నిలిచారు. వాస్త‌వానికి నిజాయితీ ప‌రుడు, వివాద ర‌హితుడు అయిన‌ప్ప‌టికీ.. రెండోసారి గెలుస్తానో.. లేదో .. అనే భ‌యం మాత్రం ఉండ‌వ‌ల్లిని వెంటాడింది. దీనికితోడు.. టీడీపీ నుంచి ప్ర‌ముఖ న‌టుడు, క‌మ్మ వ‌ర్గానికి చెందిన మాగంటి ముర‌ళీ మోహ‌న్ బ‌రిలో నిలిచారు. దీంతో ట‌ఫ్ ఫైట్ త‌ప్పే ప‌రిస్థితి లేదు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందునుంచే ముర‌ళీ మోహ‌న్ ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. దీంతో త‌న గెలుపు అంత ఈజీకాద‌ని అరుణ్ కుమార్ తెలుసుకున్నారు. 


ఈ క్ర‌మంలోనే గ‌తంలో అంటే.. 2004లో కంటే.. కూడా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో త‌న అనుచ‌రుల‌ను సిద్ధం చేశారు. భారీ ఎత్తున ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు. ఇక‌, తెల్ల‌వారితే.. ప్ర‌చారం ప్రారంభించాలి.. అన్ని రెడీ అయిపోయాయి. మైకులు, వాహ‌నాలు సిద్ధం. అనుచ‌రులు కూడా వ‌చ్చేసి హోట‌ళ్ల‌లో బ‌స చేశారు. ఎంపీ పార్టీ కార్యాల‌యంలో సంద‌డే సంద‌డి. ఇదే ఆలోచ‌న‌తో ఆ రాత్రి.. నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు సిట్టింగ్ ఎంపీ ఉండ‌వ‌ల్లి. కానీ, ఆయ‌న నిద్ర ప‌ట్ట‌డం లేదు. ఎన్నిక‌లు.. ప్ర‌చార‌మే క‌ళ్ల‌లో మెదుల్తోంది. ఎప్ప‌టికో.. తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న క‌ళ్లు మూత‌బ‌డుతున్నాయి. 

 

ఇంత‌లోనే ``సార్‌.. సార్‌.. హైద‌రాబాద్ నుంచి పెద్ద‌సార్ ఫోన్‌``-అంటూ.. పీఏ త‌లుపు త‌ట్టాడు. అప్పుడ ప్పుడే.. క‌ళ్లు మూత‌లు ప‌డుతున్న స‌మ‌యంలో ఉలిక్కిప‌డి లేచిన ఉండ‌వ‌ల్లి.. ఫోన్ అందుకున్నారు.. అటు నుంచి సిట్టింగ్ సీఎం.. వైఎస్‌.. ``ఇదిగో అరుణ్‌.. నువ్వు వెంట‌నే బ‌య‌ల్దేరి.. సిద్దిపేట వెళ్లాలి. అక్క‌డి ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాహుల్ గాంధీ గారు వ‌స్తున్నారు. ఆయ‌న ప్ర‌సంగాన్ని నువ్వే తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేయాలి. వెంట‌నే బ‌య‌ల్దేరు!`` ఇదీ.. వైఎస్ ఆదేశం. అంతేకాదు.. ఫోన్ కూడా క‌ట్ట‌యింది! ఇప్పుడు ఏం చేయాలి.. ఉండ‌వ‌ల్లి గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టాయి. ఒక‌వైపు ప్ర‌త్య‌ర్థి ముర‌ళీ మోహ‌న్ దూకుడుగా ప్ర‌చారం మొద‌లు పెట్టేశారు. కానీ,తాను ఇంకా.. ప్రారంభించ‌నేలేదు. ఎట్ట‌కేల‌కు ముహూర్తం పెట్టుకుంటే.. వైఎస్ ఇలా ఆదేశించ‌డం ఏంటి? అనుకుంటూ వైఎస్‌కు తిరిగి ఫోన్ క‌లిపారు. 

 

``సార్‌.. ఇక్క‌డ ఫైట్ ట‌ఫ్‌గా ఉంది. నేనింకా క్యాంపెయిన్ స్టార్ట్ చేయ‌లేదు. ఉద‌యాన్నే ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ.. ఇప్పుడు సిద్దిపేట వెళ్తే.. `` ఇంకా ఏదో చెప్ప‌బోయారు ఉండ‌వ‌ల్లి.. అటు వైపు నుంచి వైఎస్.,. ``అంతా నేను చూసుకుంటాను. నువ్వు రాహుల్ గాంధీ గారు ఎన్ని రోజులు క్యాంపెయిన్ చేస్తారో.. అన్ని రోజులు ఆయ‌న వెంటే వుండి.. ప్రసంగాలు త‌ర్జుమా చేయాలి`` -మ‌ళ్లీ ఫోన్ క‌ట్ అయింది. ఉండ‌వ‌ల్లికి చెమ‌ట‌లు ప‌ట్టాయి! అయినా త‌ప్ప‌దు.. వైఎస్ ఆదేశం.. ఏం చేస్తాం.. అనుకుంటూనే .. మ‌రుక్ష‌ణం సిద్ధిపేట‌కు బ‌య‌ల్దేరారు. ఇలా.. ఆయ‌న రాహుల్ వెంటే.. ఆ ఎన్నికల ప్ర‌చారానికి ఉన్న స‌మ‌యంలో గ‌డిపేశారు. 

 

క‌ట్ చేస్తే.. రెండు రోజుల్లో ఎన్నిక‌లు.. ఒకే ఒక్క‌రోజు ప్ర‌చారానికి ఉంది. హుటాహుటిన నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టారు. విష‌యం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. త‌న‌ను రాహుల్ వెంట పంపిన వైఎస్‌.. త‌న మిత్రుడు ఉండ‌వ‌ల్లి కోసం త‌నే స్వ‌యంగా వ‌చ్చి ప్ర‌చారం చేశారు. క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు.. ఉండ‌వ‌ల్లి గెలుపు గుర్రం ఎక్కారు. ఇంత ట‌ఫ్ ఫైట్ కావ‌డంతో మెజారిటీ త‌గ్గినా.. గెలుపు మాత్రం ఉండ‌వ‌ల్లినే వ‌రించింది. ఇదీ.. వైఎస్‌ను న‌మ్మిన వారికి ఆయ‌న చేసే కృషి!! ఈ విషయాన్ని ఉండ‌వ‌ల్లి అనేక సంద‌ర్భాల్లో చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: