వైఎస్‌ రాజకీయ జీవితంలో ఎన్నో మైలు రాళ్లు.. 1978లో మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మంత్రిగానూ పని చేశారు. ఇక ఆ తర్వాత ఆయన అనేక పదవులు అలంకరించారు. కాంగ్రెస్ కు వీరవిధేయుడిగా ఉంటూనే.. అసమ్మతి నేతగానూ ముద్ర వేయించుకున్నారు. పార్టీలో పదవుల సంగతి ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో మాత్రం ఆయనకు ఎప్పుడూ తిరుగులేదు. ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయన. 


అయితే ఆయన కాంగ్రెస్‌లో ఉండటం వల్ల... ఆ పార్టీ అంటే ఏమాత్రం గిట్టని తెలుగు నంబర్ వన్ దిన పత్రిక ఈనాడు కు మొదటి నుంచి కానివాడే అయ్యాడు. అలా ఈనాడుతో వైఎస్‌ శత్రుత్వం ఆరంభం నుంచే మొదలైంది. ఇక రాజకీయంగా ఆయన ఎదుగుతున్న కొద్దీ ఆ దిన పత్రికలో వైఎస్ పట్ల నెగిటివ్ కథనాలే ఎక్కువగా వచ్చేవి. ఈనాడు పత్రికకూ తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం తెలుగుప్రజలు అందరికీ సుపరిచతమే. అందువల్లే ఈనాడులో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం మొదటి నుంచి ఎక్కువే. 


అలాంటి ఈనాడు దినపత్రిక యాదృశ్చికమో.. వ్యూహాత్మకమో ఏమో తెలియదు కానీ.. వైఎస్ రాజకీయ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. 2004 ఎన్నికలకు ముందు.. వైఎస్‌ పాదయాత్ర చేపట్టారు. అప్పటి వరకూ రాష్ట్రంలో ఏ నేత కూడా సాహసించని బృహత్‌కార్యమది.. 2003లో మండు వేసవిలో వైయ‌స్ 1467 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలై శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. ఈ వైయ‌స్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది.


సహజంగా కాంగ్రెస్‌ వ్యతిరేక, వైఎస్‌ వ్యతిరేక వైఖరి అవలంబించే ఈనాడు వైఎస్‌ పాదయాత్ర గురించి మాత్రం చాలా బాగా కవర్ చేసింది. తమ పత్రికలో రోజూ కొంత స్థలం కేటాయించి పాదయాత్ర విశేషాలు, జనం స్పందన ఎలా ఉందో వివరించింది. ఇది వైఎస్‌కు విస్తృతమైన జననేతగా పేరు తెచ్చింది. 2004 నాటికి కాంగ్రెస్‌లో వై.ఎస్‌. తిరుగులేని నేతగా ఎదిగారంటే కారణం పాదయాత్రే కారణం. ఆ పాదయాత్రను విస్తృతంగా కవర్ చేయడం ద్వారా ఈనాడు వైఎస్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: