భారత్ ను దెబ్బ కొట్టేందుకు డ్రాగన్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందో అందరికీ తెలిసిందే.  జమ్మూ-కాశ్మీర్ లోని లడ్డాఖ్ ప్రాంతంలో భారత్-చైనా సరిహద్దులోకి చొచ్చుకు వచ్చింది. కావాలనే గాల్వాన్ లోయ ప్రాంతంలో వాస్తవాధీన రేఖను దాటి భారత్ భూభాగంలోకి వచ్చి మన సైన్యంపై  దాడులు చేసింది. సైన్యంపై దొంగదెబ్బ తీయాలన్న డ్రాగన్ ప్రయత్నాన్ని మన సైన్యం వెంటనే ఎదుర్కోవటంతో రెండు వైపులా భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఇంతకుముందే  కరోనా వైరస్ ను ప్రపంచం మీదకు  చైనా వ్యూహాత్మకంగా  వదిలిపెట్టిందనే ఆరోపణల విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలతో చైనాకు శతృత్వం పెరిగిపోయింది. దాంతో మన భూభాగాన్ని అక్రమించాలని చైనా చేసిన ప్రయత్నాల కారణంగా ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలబడ్డాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా దేశాలకు ప్రత్యేకించి మనదేశంపై ప్రేమ లేకపోయినా చైనా మీదున్న అపరిమితమైన ధ్వేషం కారణంగా  మనకు మద్దతుగా నిలబడ్డాయి. ఈ విషయాలను డ్రాగన్ పాలకులు గమనించారు. దాంతో ప్రపంచం ముందు చైనా దురుక్రమణ దేశంగా  తేలటంతో చేసేది లేక లడ్డాఖ్ లోని భారత్ భూభాగంలో నుండి తన సైన్యాలను  వెనక్కు తీసుకెళ్ళిపోయింది. ఇదంతా ప్రపంచం మొత్తానికి తెలిసిన ప్రయత్నాలు. ఇదే సమయంలో భారత్ ను దెబ్బ కొట్టటానికి తెర వనుక నుండి కూడ  డ్రాగన్ పెద్ద ప్రయత్నమే చేసినట్లు కేంద్రప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. చైనా ప్రయత్నాన్ని ఆలస్యంగా గుర్తించిన వెంటనే స్పందించటంతో డ్రాగన్ ప్రయత్నాలు ఇక్కడ కూడా ఫెయిలయ్యాయనే భావించాలి.

 

ఇంతకీ డ్రాగన్ దేశం చేసిన దొంగదెబ్బ ప్రయత్నం ఏమిటి ? ఏమిటంటే భారత్ లోని పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లు కొనేయటం. భారత్ కంపెనీల్లో షేర్లు కొనేందుకు చైనా వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల వరదను పారించటమే. అంటే భారత్ కంపెనీల్లో షేర్లు కొనటం ద్వారా యాజమాన్యంలో కీలక పాత్ర పోషించాలని అనుకున్నది. భారత్ కంపెనీలు గనుక చైనా ఆధీనంలోకి వెళితే మన ఆర్ధిక పరిస్ధితిని చైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లక్రిందులు చేయవచ్చు. వీలైనన్ని కంపెనీల షేర్లను వీలైనంత కొనేస్తే ఆ కంపెనీల యాజమాన్యంలో కీలక పాత్ర పోషించవచ్చనేది డ్రాగన్ దేశం వ్యూహం.

 

యావత్ ప్రపంచంలోని కంపెనీలు కరోనా వైరస్ కారణంగా కుప్ప కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వైరస్ సంక్షోభం కారణంగా కంపెనీల షేర్ల వాల్యూ మొత్తం పడిపోయింది. పెట్టుబడిదారులకు లాభాల మాట దేవుడెరుగు అసలు పెట్టుబడులు వెనక్కు వస్తే చాలన్నట్లుగా తయారైంది పరిస్ధితి. తమ షేర్లను ఎవరైనా కొనేందుకు వస్తే చాలు అమ్మేద్దామని పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఈ సంక్షోభాన్నే చైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నది. దాంతో వెంటనే  పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మనదేశంలోని కంపెనీల షేర్లపై కన్నేసింది. ఏప్రిల్ నెల 10-12 తేదీల మధ్య సుమారు 4 వేల కోట్లరూపాయలు ఇండియాలోని కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

 

హెడిఎఫ్సి బ్యాంకులో  రూ. 3100 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అంబుజా సిమెంట్ కంపెనీలో రూ. 122 కోట్లతో 0.32 శాతం షేర్లు కొనేసింది. రూ. 137 కోట్లతో పిర్మల్ ఎంటర్ ప్రైజెస్ లో 0.43 శాతం షేర్లను కొన్నది.  ఇంకా అనేక కంపెనీల్లో మేజర్ షేర్లు కొనటం ద్వారా ప్రధాన భాగస్వామి కావాలని ప్లాన్ చేసింది. అయితే కంపెనీల షేర్లను చైనా కొనుగోలు చేసిన రెండు రోజల తర్వాత అంటే ఏప్రిల్ 14వ తేదీనే  కేంద్రప్రభుత్వానికి సమాచారం అందింది. దాంతో  ఈ విషయంలో కేంద్రం చాలా లోతుగా దర్యాప్తు చేసింది. దాంతో డ్రాగన్ దేశం కుట్ర బయటపడింది. దాంతో విదేశీ పెట్టుబడుల విధానంలో మార్పులు చేసేసింది.  సరిహద్దు దేశాలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా కేంద్రప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిబంధనను విధించింది. నిబంధన విధించటం బాగానే ఉంది. కానీ ఇప్పటికే కొనుగోలు చేసిన షేర్ల విషయంపై ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: